ప్ర‌స్తుత పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. రెండు చోట్లా  కూడా గెలుపు ఖాయ మ‌ని చెబుతున్న ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీ ప‌ట్నం. ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి.. జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. ఈయ‌న గెలుపు త‌థ్య‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి ప్ర‌దానంగా నాలుగు రీజ‌న్లు తెర‌మీదికి వ‌చ్చాయి. 1) టీడీపీ క‌లిసి రావ‌డం. 2) జ‌న‌సేనకు బ‌లం ఉండడం. 3) వైసీపీ టికెట్ ఇవ్వ‌లేద‌న్న సానుభూతి 4) అభివృద్ధి నేత‌గా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌.


1) టీడీపీ క‌లిసి రావ‌డం:  రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మ‌డి పార్టీల నేత‌ల మ‌ధ్య కొంత స‌మ‌న్వ‌య లోపం క‌నిపి స్తోంది. టికెట్లు ఆశించిన వారు .. అవి ద‌క్క‌క పోవ‌డంతో మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌తో చేతులు క‌లిపేందుకు ముందుకు రావ‌డం లేదు. కానీ, మ‌చిలీప‌ట్నంలో మాత్రం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ నేతృత్వంలో అంద‌రూ క‌లివిడిగా ముందుకు సాగుతున్నారు. నారాయ‌ణ‌కు చంద్ర‌బాబు ముందే చెప్ప‌డం.. ఆయ‌న‌కు కూడా ఇంట్ర‌స్ట్ లేక పోవ‌డంతో ఇక్క‌డ పాలు -తేనె మాదిరిగా టీడీపీ - జ‌న‌సేన క‌లిసిపోయి ప‌నిచేస్తున్నాయి.


2) జ‌న‌సేన‌కు బ‌లం:  మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాపులు, బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. దీంతో ఇక్క‌డ కాపులు జ‌న‌సేన‌కు జై కొడుతున్నారు. పార్టీ ప‌రిస్థితితో సంబంధం లేకుండా.. ప‌వ‌న్ అంటే.. వారు ప్రాణం పెడుతున్నారు. దీంతో కాపుల ఓట్లు గుండుగుత్త‌గా బాల‌శౌరికే ప‌డ‌నున్నాయి. ఇక‌, ఆది నుంచి బీసీలు టీడీపీతోనే ఉన్నారు కాబ‌ట్టి.. వారు కూడా.. బాల‌శౌరికే విజ‌యం ద‌క్కేలా స‌హ‌క‌రించ‌నున్నారు. ఈ రెండు కూడా.. జ‌న‌సేన‌కు బ‌లంగా మార‌నున్నాయి.


3) సానుభూతి:  గత ఐదేళ్లు వైసీపీలోనే ఉన్న బాల‌శౌరికి ఆ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు సేమ్ టికెట్ ఇచ్చేది లేద‌ని తెలిపింది. దీంతో ఆయ‌న యాగీ చేయ‌కుండా.. మౌనంగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. జ‌న‌సేన త‌ర‌పున టికెట్ తెచ్చుకున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌చారంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు. తాను ఐదేళ్లు నమ్మిన బంటుగా ఉన్నా.. పార్టీ త‌న‌కు టికెట్ ఇచ్చేందుకు స‌హ‌క‌రించ‌లేద‌ని చెబుతున్నారు. ఇది మోసం చేయ‌డం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో సానుభూతి  బాల శౌరికే ద‌క్కుతోంది.


4) అభివృద్ది:  బాల శౌరి విజ‌యం రాసిపెట్టుకోవ‌చ్చ‌ని అంటున్న‌వారి వెనుక ఉద్దేశం ఇదే. ఆయ‌న గ‌త ఐదేళ్లుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. రాజ‌కీయాలంటే.. మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌త్య‌ర్థుల‌ను తిట్టిపోయ‌డం కాద‌ని.. అభివృద్ది చేసి చూపించాల‌ని ఆయ‌న నిరూపించారు. అంతేకాదు.. ఈ ఐదేళ్ల‌లో శౌరి మీడియా ముందుకు వ‌చ్చింది నాలుగైదు సార్లు మాత్ర‌మే. అలా వ‌చ్చినా.. ఆయ‌న అభివృద్ధి గురించే ఎక్కువ‌గా స్పందించారు. ఒకే ఒక్క‌సారి మాత్రం పేర్ని నాని విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో అభివృద్ది నాయ‌కుడిగా శౌరి పేరు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: