45 ఏళ్ల కిందట వరకు ఈ రెండు దేశాలు మిత్రులే. కానీ.. కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ఒకటి ప్రజాస్వామ్య దేశంగా మిగలగా.. మరొకటి మత రాజ్యంగా మారింది. ఒకటి అత్యంత బలమైన దేశంగా ఎదగగా.. మరొకటి తనదైన శైలిలో ముందుకు వెళ్లి వివాదాస్పద దేశంగా మిగిలింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కయ్యం మొదలైంది.


సిరియాలోని రాజధాని దమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై రెండు వారాల క్రితం వైమానిక దాడిలో ఇద్దు సైనిక జనరళ్లు సహా ఐదుగురు మృతి చెందారు. ఇది ఇజ్రాయెల్ పనేనని ఆరోపించి.. ప్రతీకారంగా  ఆ దేశంపై డ్రోన్లతో, మిస్సైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. అయితే ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూ భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.


గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు నేరుగా తలపడనున్నాయి. ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పై దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియాలో మరో పూర్తిస్థాయి యుద్ధానికి తెరలేచినట్లవుతుంది. ఇక సైనిక పరంగా  ఇరాన్ 14 వస్థానంలో ఉండగా.. ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇరాన్ వద్ద ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు. పశ్చిమాసియాలో ఇంత కన్నా పెద్ద మొత్తంలో ఈ అస్త్రాలను పోగేసుకున్న దేశం మరోకటి లేదు.


గగనతలంలో ఇజ్రాయెల్ ది తిరుగులేని శక్తి. ఆదివారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను 99శాతం ఆకాశంలోనే నేలకూల్చినప్పుడు ఇది మరోసారి తేటతెల్లమైంది. సైనిక పరంగా ఇజ్రాయెల్, ఇరాన్ రెండు శక్తిమంత దేశాలే. జనాభా, విస్తీర్ణం చూసుకుంటే ఇరాన్ చాల పెద్దది. అయితే ఆ దేశం వద్ద సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. మొత్తంగా చూసుకుంటే యుద్ధం అంటూ ఆరంభం అయితే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా సాగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: