తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీ చాలా ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సాధారణంగా కాంగ్రెస్‌లో నాయకత్వం విషయంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినా సరే ఏ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. మాములుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లే రాష్ట్ర సీఎంలు నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ స్వేచ్ఛను రేవంత్ రెడ్డి సాధించుకోగలిగారు.

పీసీసీ, సీఎం రెండు పదవులను ఆయనే దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. పార్టీలో తనకంటూ ఎవరూ శత్రువులు, ప్రత్యర్ధులు లేకుండా కూడా చూసుకున్నారు. పార్టీ అధినాయకత్వపు అడుగుజాడల్లో నడవకుండా ఆ అధినాయకత్వాన్ని తన వైపు తిప్పుకున్న డైనమిక్ పొలిటికల్ లీడర్ రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌లో చేరాక బట్టి విక్రమార్క వంటి కీలక నేతలను తన వెంట పెట్టుకొని తిరిగారు రేవంత్. పార్టీలో చాలా కాలంగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి వంటి వారిని సైడ్ ట్రాక్ చేశారు. సీఎం అయ్యాక బట్టి వంటి నాయకులను పూర్తిగా పక్కన పెట్టేశారు. తాను ఒక్కడే స్టార్ క్యాంపెయినర్‌లాగా లోక్‌సభ ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఒక కింగ్ మేకర్ అయిపోయారు.

ఆ రేంజ్ లో ఆయన పార్టీని తన గ్రిప్ లో పెట్టుకోగలిగారు. ఈ రకంగా పనిచేస్తూనే గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా వర్క్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ కీలక నేతలను హస్తం పార్టీలోకి వచ్చేలా చేశారు. తెలంగాణలో బీజేపీ నేతలను కూడా తొక్కిపడేశారు. 2024 లోక్‌సభ ఎలక్షన్ల వేళ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన బీఆర్ఎస్ నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు విమర్శలకు దారితీసాయి. గుడ్లగూబ, గబ్బిలానికి మధ్య తేడా తెలియకుండా మాట్లాడటం, ట్రాన్స్‌ఫర్మర్‌లో ఆయిల్ చేంజ్ చేస్తే కరెంట్ వస్తుందని చెప్పడం రేవంత్ ని చూసి జాలి పడేలా చేశాయి.

వంద రోజుల్లో చెప్పిన హామీలు నెరవేరుస్తామని రేవంత్ హామీ ఇచ్చారు కానీ మాట నిలబట్టుకోలేకపోయారు. ఇప్పటికే నెరవేర్చాల్సినవి చాలానే ఉన్నాయి. ఇవి నెరవేర్చకముందే పార్లమెంటు నియోజకవర్గాల్లో హామీలు ఇస్తున్నారు కానీ ప్రజలు నమ్ముతారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత ఉందా లేదంటే సానుకూలత ఉందా అనేది లోక్ సభ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. ఈ పరీక్షలో నెగ్గితేనే రేవంత్ కి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: