- ఆనాడు వైఎస్ తో ఈటెల కొట్లాడాలేదా..?
- ఆ శక్తి ఏపీలో ఓడిన నాయకులకు ఉండట్లేదా..?
- పదవి వ్యామోహమే ప్రథమ ధ్యేయమా..?

ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారపక్షం,ప్రతిపక్షం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలా ఉంటేనే రాజకీయాలకు ఒక అందం. దానివల్లే ప్రజా సమస్యలు కూడా నెరవేరుతాయి. కేవలం అధికారం ఉంటేనే ప్రజల సమస్యలపై కొట్లాడతాను లేదంటే నాకు అవసరం లేదు అనే ధోరణి పాటిస్తే మాత్రం వాళ్లు అసలైన రాజకీయ నాయకులు కాలేరని చెప్పవచ్చు. కేవలం అధికార దాహంతోనే వాళ్ళు ఉంటున్నారు తప్ప ప్రజల కోసం వాళ్ళు చేసేది ఏమీ ఉండదని తప్పక గ్రహించాలి. ఎంతమంది అధికార పక్షం ఉన్నా ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా సరే ప్రజా సమస్యలపై ప్రభుత్వం చేసే తప్పులపై కొట్లాడవొచ్చు. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఇప్పటికే ఆయన మూడుసార్లు ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో తన గళాన్ని వినిపించాడు. కనీసం ఆయనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకున్నా కానీ దొరికిన సమయాన్ని రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికి ఉపయోగించుకున్నాడు. అంతటి టాలెంట్ ఉంది కాబట్టి ఈనాడు కేంద్రమంత్రి పదవి వరించిందని చెప్పవచ్చు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గెలిచిన నాయకులు తప్ప ఓడిపోయిన నాయకులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే మంట కలుపుతున్నారు. ఆనాడు చంద్రబాబు అలాగే చేశాడు. ఇప్పుడు జగన్ కూడా అలాగే చేయబోతున్నాడు. వీరికి పదవి ఆశలు తప్ప ప్రజా సమస్యలు పట్టవా అనేది తెలుసుకుందాం.
 

కొట్లాడే శక్తి లేదా జగన్:
 జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఏకధాటిగా పాలించారు. ఎన్నో పథకాలు తీసుకువచ్చారు. ఇంకా ఎన్నో సమస్యలు తెలుసుకున్నారు.  ఆయన హయాంలో కొన్ని పనులు పూర్తయ్యాయి. ఇంకా ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి ఈ తరుణంలోనే 2024 ఎలక్షన్స్ లో  టిడిపి కూటమి పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా అనేది లేకున్నా సరే ప్రశ్నించే తత్వం ఉంటే అది ప్రతిపక్ష హోదానే అవుతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తాను ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటికీ అనుకోవడంలేదని అనిపిస్తోంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. కనీసం పూర్తిస్థాయిగా ప్రమాణ స్వీకారాలు అయిపోయే వరకు కూడా వెయిట్ చేయలేదు. అంతేకాకుండా ఆయన  అసెంబ్లీలో కూడా ప్రశ్నించే తత్వమైతే కనిపించడం లేదు. తనకు తక్కువ ఎమ్మెల్యేల పట్టు ఉందనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న 11 మందిలో  నాలుగు నుంచి ఐదుగురు టిడిపి కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇక మిగతా ఐదు నుంచి ఆరు మంది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీలో తన గళాన్ని వినిపించవచ్చు. మిగిలినవారందరూ వెళ్లిపోయినా ఆయన ఒక్కడైనా సరే ప్రజల సమస్యలపై తప్పనిసరిగా పోరాడవచ్చు. అలా ఒంటరిగా పోరాడితేనే  ప్రజలలో గుర్తింపు లభిస్తుందనేది ఆయన మరిచిపోయినట్టు ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా ఎన్నో కొన్ని తప్పులు చేస్తుంది.


 ఆ తప్పులను ఎత్తి చూపే వాడే ప్రతిపక్షనేత. అది జగన్ ఎందుకు కాకూడదు. జగన్ ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. కేవలం అధికారం ఉంటేనే అసెంబ్లీలో అడుగు పెడతారా.. అలా అయితే ఇక రాజకీయ జీవితాన్ని వదిలిపెడితేనే బాగుంటుంది. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై కొట్లాడే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. పదవి ఉంటేనే ప్రజా సమస్యలు తెలుసుకుంటాను అసెంబ్లీలో కొట్లాడుతాను అంటే  అతను నిజమైన ప్రజాసేవ చేసే నాయకుడు కాదని చెప్పవచ్చు. ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబాన్ని అవమానించారని సంవత్సరకాలం కి పైగా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ప్రజా సమస్యలపై గళం ఎత్తలేదు. అదే ధోరణితో  జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్లారు. ఇక ఆయన ప్రజా సమస్యలపై కొట్లాడే అవకాశం కూడా ఉండదనేది ఆయన వైఖరి చూస్తే మాత్రం అర్థమవుతుంది. వైయస్ మరియు  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  అసెంబ్లీలో ఏకైక తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  ప్రత్యేక రాష్ట్రం కోసం  గట్టిగా కొట్లాడాడు. దీంతో తెలంగాణలో ఫేమస్ లీడర్ గా మారాడు. కొట్లాడే శక్తి ఉంటే మన చుట్టూ ఎంతో మంది అవసరం లేదు,  ప్రశ్నించే గొంతుక ఒక్కటి ఉంటే చాలు అనేది జగమెరిగిన సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: