పాకిస్తాన్ భద్రతా దళాలపై ఒకేసారి రెండు కీలక ప్రాంతాల నుంచి ఊహించని దాడులు జరిగాయి. భారత్‌తో సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అంతర్గత పరిస్థితులు పాకిస్తాన్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ వజీరిస్తాన్‌లో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో ఏకంగా ఇరవై మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేకెత్తించింది.

షకాయ్ సబ్-డివిజన్‌లోని డాన్‌గేట్ అవుట్‌పోస్ట్‌పై గురువారం రాత్రి టీటీపీ ఈ దాడికి తెగబడింది. ఇది కేవలం ఒక్క దశలో జరిగిన దాడి కాదని, వ్యూహాత్మకంగా పలు దశల్లో నిర్వహించామని టీటీపీ ప్రకటించుకుంది. ముందుగా లేజర్ గైడెడ్ రైఫిల్స్‌తో ఆరుగురు సైనికులను హతమార్చి, ఆ తర్వాత సహాయం కోసం వచ్చిన సైనిక కాన్వాయ్‌ను అంబుష్ చేసి మొత్తం ఇరవై మంది భద్రతా సిబ్బందిని మట్టుబెట్టినట్లు, మరో ఐదుగురిని గాయపరిచినట్లు టీటీపీ తమ ప్రకటనలో వెల్లడించింది.

ఈ దాడికి కారణం చెబుతూ టీటీపీ చేసిన ఆరోపణలు మరింత కలకలం సృష్టించాయి. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ బహవాల్‌పూర్ స్థావరం వివరాలను పాక్ సైన్యం భారత్‌కు లీక్ చేసిందని, దాని వల్లే భారత వాయుసేన దాడి చేసి మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో సహా పద్నాలుగు మందిని చంపేసిందని టీటీపీ ఆరోపించింది. పాక్ సైన్యాన్ని 'ద్రోహం చేసేదని', 'పశ్చిమ దేశాల తొత్తుగా' అభివర్ణించిన టీటీపీ ప్రతినిధి మొహమ్మద్ ఖొరాసాని, సైన్యం ఒక 'ప్రొఫెషనల్ కిల్లర్ గ్రూప్' అని, స్వప్రయోజనాల కోసం సొంత ప్రజలను విదేశీ శక్తులకు అమ్ముకుంటోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. జిహాదీలను 'ఇస్లామేతరులకు' అప్పగిస్తోందని, అబోటాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికాకు పట్టించిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా, బలూచిస్తాన్ ప్రాంతంలోనూ పాక్ సైన్యంపై దాడులు పెరిగాయి. బలూచ్ స్వాతంత్ర్య యోధులు శుక్రవారం సాయంత్రం బలూచిస్తాన్‌లో వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేశారు. టర్బట్‌తో పాటు, క్వెట్టాలోని హజార్‌గంజి, ఫైజాబాద్ ప్రాంతాల్లో పాక్ సైనిక స్థావరాలపై గ్రెనేడ్ దాడులు జరిపారు. ఈ ఘర్షణల్లో మరో ఇద్దరు పాక్ సైనికులు మరణించారు.

తాజా దాడులకు రెండు రోజుల ముందు కూడా బోలన్‌లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక పాక్ సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బ్లాస్ట్ చేసింది. ఆ దాడిలో ప్రత్యేక ఆపరేషన్స్ కమాండర్‌తో సహా ఎనిమిది మంది సైనికులు అక్కడికక్కడే చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేవలం వారం రోజుల క్రితం క్వెట్టాలో బీఎల్ఏ జరిపిన ఐఈడీ దాడిలో పది మంది పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు.

టీటీపీ 'ఆపరేషన్ ఖందక్' పేరుతో పాక్ దళాలపై దాడులను తీవ్రతరం చేయగా, బలూచ్ మిలిటెంట్లు స్నైపర్లు, రిమోట్ కంట్రోల్ బాంబులు, అంబుష్ దాడులతో సైన్యాన్ని ఇరుకున పెడుతున్నారు. ఒకవైపు భారత్‌తో సరిహద్దులో ఉద్రిక్తతలు నివురుగప్పిన నిప్పులా ఉండగా, టీటీపీ, బీఎల్ఏ వంటి సంస్థల దాడులతో పాకిస్తాన్ మూడు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ భద్రతా పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: