
ఒకప్పటి ఉమ్మడి పశ్చిమగోదావరి, ఇప్పుడు ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉన్న చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఒకప్పుడు చింతలపూడిని శాసించిన కోటగిరి విద్యాధరరావు తర్వాత ఆ స్థాయి పదవులు ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకులకు దక్కడం లేదు. మధ్యలో పీతల సుజాత లాంటి వారికి మంత్రి పదవి ఇచ్చినా.. పూర్తి కాలం ఉంచలేదు. మరీ ముఖ్యంగా 2004 తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అహోరాత్రులు కష్టపడడం వరకే నాయకుల వంతు అవుతోంది.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరివైపు కూడా అధిష్టానం చూడడం లేదు. 2014లో పార్టీ గెలిస్తే 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు వరకు చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ పదవి భర్తీ చేయలేదంటే అధిష్టానం కళ్లులేని కబోధిలా ఉందా ? అన్న ప్రశ్న తలెత్తక మానదు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ ఐదేళ్ల పాటు రెండు నియోజకవర్గాల నాయకులు పార్టీ కోసం ఎన్నోపోరాటాలు, త్యాగాలు చేశారు. పోలవరం సీటు జనసేనకు ఇస్తే డ్యామ్ షూర్‌గా పోతుందని అన్ని సర్వేలు చెప్పినా గెలిపించి జనసేన తరపున చిర్రి బాలరాజును ఎమ్మెల్యేను చేశారు. చింతలపూడి ఏఎంసీ కోసం టీడీపీలో ఎందరో సీనియర్లు, కీలక నేతలు పోటీపడినా మిత్రపక్షం జనసేనకు ఇవ్వాల్సి వచ్చినా కిమ్మనలేదు. ఇలా ఎన్ని త్యాగాలు చేసినా ఈ రెండు నియోజకవర్గాల్లో నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కాదు కదా... జిల్లా స్థాయి పదవులకే దిక్కులేకుండా పోతోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నియోజకవర్గం టి.నరసాపురం మండలానికి చెందిన సీనియర్ నేతలు శీలం వెంకటేశ్వరరావు యాదవ్, జయ్యవరపు శ్రీరామ్మూర్తి, అటు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంకు చెందిన డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషుకు పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టారు. తెల్లకాగితాల మీద రాసుకోవడానికి... పేపర్లలో పేర్లు వేసుకోవడానికి తప్పా ఆ ముగ్గురు నాయకులకు ఒరిగిందేమి లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శీలం, శ్రీరామ్మూర్తి లాంటి సీనియర్లకు గౌరవం, పార్టీ కోసం శేషు పడ్డ కష్టాల నేపథ్యంలో రాష్ట్ర పదవులే దక్కాయి. పార్టీ గెలిచాక వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. తాజాగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో... జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణతో పాటు శీలం వెంకటేశ్వరరావు, దాసరి శేషు పేర్లు బలంగా రేసులో ఉన్నాయి. వెనకబడిన ఈ రెండు రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు కనీసం జిల్లా పరంగా అయినా అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు నేతల్లో ఒకరికి జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్లు 11 మండలాలు, 1 మున్సిపాల్టీ, 1 నగర పంచాయతీ నేతల నుంచి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
శీలం కష్టం అలాంటిది ఇలాంటిది కాదు..
2004లో పార్టీ ఓడిపోయాక నాడు ఉమ్మడి జిల్లా పార్టీ సమావేశాలకే టి.నరసాపురం మండలాన్ని వేదిక చేశారు. అప్పటి జిల్లా సమావేశాలతో పాటు జిల్లా పార్టీ నాయకులను టి.నరసాపురంకు తీసుకువచ్చి మీటింగ్‌లు పెట్టి.. మెట్ట ప్రాంత తెలుగుదేశం కేడర్లో జోష్ నింపారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జడ్పీటీసీ, 2014 తర్వాత ఎంపీపీ అయినా అక్కడితో ఆగిపోయారు. కొన్ని నియోజకవర్గాలకు పరిశీలకుడిగా... ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉన్నంతలో శీలంకు ఉపశమనం ఏంటంటే తన కుమారుడు, తన సమీప బంధువు ఇద్దరికి సొసైటీ ఛైర్మన్ పదవులు ఇప్పించుకున్నారు. శీలం 2014కు ముందు నుంచే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయినా అది చిక్కడం లేదు. ఇప్పుడు జిల్లా ఎంపీ, మంత్రి, ఏలూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఇలా కీలక పదవుల్లో యాదవ కమ్యూనిటీ నేతలు ఉండడంతో శీలం ఆ ఈక్వేషన్లలో చిక్కుకుపోయారు. అయినా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
శేషుది 15 ఏళ్లకు పైగా కష్టం...
2004 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత 2007లో విశాఖ ఆంధ్రావర్సిటీలో ఒక్క విద్యార్థి పార్టీ జెండా మోసేందుకు ముందుకు రాని వేళ శేషు నాడు బలంగా ఉన్న పార్టీని ఎదుర్కొని యూనివర్సిటీలో జెండా మోశారు. శేషు ధైర్యం మెచ్చుకునే అయ్యన్నపాత్రుడు, ఘంటా శ్రీనివాసరావు ఇద్దరు సీనియర్ నేతలు శేషు అయితేనే వర్సిటీ విద్యార్థి విభాగంలో పార్టీ స్ట్రాంగ్ అవుతుందని నాడు అధిష్టానానికి ఘంటాపథంగా చెప్పారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి స్టేట్ వైడ్‌గా నాటి అధికార వైసీపీ విధానాలను ఎండగట్టి తక్కువ టైంలోనే రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యారు. ఎల్ఎల్‌బీతో పాటు పీహెచ్‌డీ చేసిన శేషు ఉన్నత విద్యావంతుడే కాదు... యువకుడు కూడా... బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి ఏలూరు జిల్లాలోనే చెప్పుకునేందుకు ఒక్క పదవి లేదు. పార్టీ పదవుల్లోనూ.. ప్రభుత్వ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గానికి అన్యాయం జరిగిందన్న వాదన కూడా ఉంది. గౌడ సామాజిక వర్గం పార్టీ ఓడిపోయిన 2019 ఎన్నికల్లోనూ ఏలూరు జిల్లాలో పార్టీ వెంటే నిలబడిందని డేటా లెక్కలు చెపుతున్నాయి. బీసీ, యువత, ఉన్నత విద్యాకోటాలో శేషు పేరు నానుతోంది. రెండు రోజుల క్రితమే శేషు .. మరోసారి యువనేత లోకేష్‌ను కలిసి తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
ఘంటా మురళీ ప్రతిపక్షంలో ఫైటర్...
2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఐదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ కాలి చెప్పులు అరిగేలా తిరిగారు. ఎన్నికలకు ముందు వరకు చింతలపూడి టీడీపీకి ఇన్‌చార్జ్ లేని వేళ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో చింతలపూడి లాంటి పెద్ద, రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో మంచి ఊపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ మురళీ పడిన కష్టానికి ఇప్పటి వరకు సరైన పదవి రాలేదు. రాష్ట్ర స్థాయిలో ఓ నామినేటెడ్ పదవి ఇస్తామన్నా ఆయన ఆసక్తి చూపలేదు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఏదేమైనా మెట్టప్రాంతంలోని చింతలపూడి, పోలవరం రిజర్వ్‌డ్ నియోజకవర్గాల నేతలకు జిల్లా స్థాయి పదవుల విషయంలో ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది.. మరి ఈ సారైనా న్యాయం జరుగుతుందేమో ? అన్న ఆశలతో ఉన్నారు.