
ఎందుకు దూరం? .. దగ్గుబాటి ప్రసాద్‌పై పార్టీ హైకమాండ్ అసంతృప్తికి కారణాలు అనేకం. ఆయన నియోజకవర్గంలో తనకున్న ప్రత్యర్ధులను చెక్ పెట్టాలనే ఆలోచనలో పలు సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం, స్థానిక నేతలతో సఖ్యతగా లేకపోవడం కూడా ఆయనకు మైనస్ అయ్యాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి, సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం, పార్టీలో కలహాలు పెంచడం, తన ఇమేజ్‌ను తానే దెబ్బతీయడం అన్నీ కలిపి ఆయనను చంద్రబాబు హిట్‌లిస్ట్‌లోకి నెట్టేశాయి. హెచ్చరికలతో ఫలితం లేకపోవడంతో… ఇప్పటివరకు పలు మార్లు హెచ్చరించినా దగ్గుబాటి తన వైఖరిలో మార్పు తీసుకురాలేదని తెలుస్తోంది. ఇక చివరకు చంద్రబాబు కఠిన నిర్ణయానికి వెళ్ళారు. అనంతపురం సభలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టి, పేరు ప్రస్తావించకపోవడం, పలకరించకపోవడం వెనుక స్పష్టమైన సంకేతమే ఉంది – “మారాలి లేకపోతే పక్కన పడతారు.”
మిగిలిన ఎమ్మెల్యేలకూ హెచ్చరికే! .. దగ్గుబాటిని ఇలాగే పక్కన పెట్టడం ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలకూ క్లియర్ వార్నింగ్ వెళ్లింది. పార్టీలో వివాదాలను రేపితే, పెద్దల మాట వినకపోతే, టిక్కెట్ ఇచ్చినంత మాత్రాన కాపాడుకుంటామనుకోవద్దు అనే మెసేజ్ బలంగా వెళ్ళింది. ఒకరిని బలి ఇచ్చినా, వందమందిని కంట్రోల్‌లో పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల విశ్లేషణ. చూడాలి మరి … ఇక ప్రశ్న ఏమిటంటే – దగ్గుబాటి లాంటి నేతల పరిస్థితి చూసి మిగిలిన ఎమ్మెల్యేలు దారిలో పడతారా? లేక తమదైన గీత దాటుతారా? అన్నది. కానీ ప్రస్తుతం ఉన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా చెబుతున్నాయి – చంద్రబాబు ఇక కఠినంగా వ్యవహరించబోతున్నారు. పార్టీ ప్రతిష్టకు చెడ్డపేరు తెచ్చే వారిని వదిలిపెట్టే ఆలోచన లేనే లేదు.