తృణమూల్ కాంగ్రెస్‌ సీనియర్ నేత ముకుల్ రాయ్‌కి భారీ షాక్‌ ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ సభ్యుడిగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఈ నిర్ణయం ఇచ్చిందని జస్టిస్ దేబాంగ్సు బసాక్, జస్టిస్ మొహమ్మద్‌ షబ్బార్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భారత న్యాయశాస్త్ర చరిత్రలో హైకోర్టు ఒక శాసనసభ్యుడిని నేరుగా అనర్హుడిగా ప్రకటించి, సభ్యత్వాన్ని రద్దు చేసిన ఘటన ఇదే తొలిసారి అని న్యాయమూర్తులు పేర్కొన్నట్టు సమాచారం.


ముకుల్ రాయ్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌ చీఫ్ మమతా బెనర్జీతో విభేదాలు ఏర్పడి పార్టీని వీడారు. అనంతరం ఆయన బీజేపీలో చేరి, 2021 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణనగర్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎన్నికైన నెలరోజులకే ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీ గూటికి చేరడం రాజకీయంగా భారీ చర్చకు దారితీసింది.ఈ మార్పిడిని ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనగా అభిప్రాయపడి, బీజేపీ నేత సువేందు అధికారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం గురువారం తమ తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుతో ముకుల్ రాయ్‌ శాసనసభ సభ్యత్వం సహా, అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవికి దాఖలైన నామినేషన్‌ కూడా రద్దయింది.



తీర్పుపై సువేందు అధికారి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది రాజ్యాంగబద్ధ పరిపాలనకు తిరుగులేని విజయం అని అభివర్ణించారు.ఇక ఈ తీర్పు పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ‘పాఠం’ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీ మార్పులు, నాయకత్వ మార్పుల సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై ఆయన రాజకీయ నిర్ణయాలు మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, “మమతాకు భారీ షాక్ – రేవంత్‌కు గుణపాఠం” అంటూ సోషల్ మీడియాలో ఘాటు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. హైకోర్టు తాజా తీర్పు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఫిరాయింపు రాజకీయాలపై కూడా కొత్త చర్చకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: