ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నోటి నుంచి "మూడు ప్రాంతాలు" అన్న మాట వ‌స్తే రాజ‌కీయ వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ‌టం స‌హ‌జం! ఎందుకంటే, ఈ "మూడు" అనే ప‌దంపై గ‌తంలో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం పేటెంట్ హ‌క్కుల కోసం పోరాడింది. అయితే, బాబు నోటి నుంచి వ‌చ్చిన ఈ "మూడు మాట" వెనుక భారీ రాజ‌కీయ వ్యూహం దాగి ఉంది. కేవ‌లం అమ‌రావ‌తిపైనే దృష్టి పెట్టి మిగిలిన ప్రాంతాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే పాత విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా, కూట‌మి ప్ర‌భుత్వం వేసిన మెగా స్కెచ్ ఇది!


వైఎస్సార్‌సీపీ "మూడు" వేరు... బాబు "మూడు" వేరు! .. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వానికి ఘోర ప‌రాజ‌యం రావ‌డానికి ఆ 'మూడు రాజ‌ధానుల కాన్సెప్టే' ఒక ప్ర‌ధాన కార‌ణం. అయితే, చంద్ర‌బాబు చెబుతున్న "మూడు ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధి" నినాదం దానికి పూర్తి భిన్న‌మైంది. అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా పూర్తి చేయాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్న బాబు, గ‌తంలో చేసిన త‌ప్పును రిపీట్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు. కేవ‌లం అమ‌రావ‌తిపైనే ఫోక‌స్ పెడితే, వైఎస్సార్‌సీపీ మళ్లీ ప్రాంతాల సెంటిమెంట్‌ను రెచ్చ‌గొట్టే అవ‌కాశం ఉంది. అందుకే ఆ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వ‌కుండా, ఏపీలోని అన్ని ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధిని త‌న అజెండాగా బాబు ముందుకు తీసుకెళ్తున్నారు.



అమ‌రావ‌తిపై పూర్తి దృష్టి... ప‌క్క‌నే స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ! .. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కీలక విష‌యాల‌ను వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది నాటికి అమ‌రావ‌తి రాజ‌ధానిని ఒక కొలిక్కి తీసుకురావాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఇది అమ‌రావ‌తి రైతుల‌కు, రాజ‌ధాని నిర్మాణానికి శుభ‌వార్త. అంతేకాకుండా, అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త్వ‌ర‌లోనే ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని, సీఆర్‌డీఏ అధికారులు, ఇత‌రుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పైనా విచార‌ణ జ‌రిపిస్తామ‌ని గ‌ట్టిగా చెప్పారు. ఒక వైపు రాజ‌ధాని అంశాల‌పై పూర్తి ఫోక‌స్ పెడుతూనే, ఏపీ మొత్తం మీదనే త‌న దృష్టి ఉంద‌ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా పెట్టుబ‌డుల‌ను, అభివృద్ధి ప‌నుల‌ను అన్ని ప్రాంతాల‌కు స‌మ‌తుల్యంగా పంచుతామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు.



వైఎస్సార్‌సీపీకి చిక్కులు... కొత్త శ‌కం! .. "మూడు ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధి" నినాదాన్ని బాబు అందుకోవ‌డం వ‌ల్ల, అమ‌రావ‌తిని నిర్ల‌క్ష్యం చేసిందనే విమ‌ర్శ‌ను వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవ‌డంతో పాటు, ఇప్పుడు బాబుపై ప్రాంతీయ వివ‌క్ష విమ‌ర్శ‌లు చేసేందుకు వారికి చాన్స్ లేకుండా పోయింది. ఈ స్మార్ట్ మూవ్ రాజ‌కీయంగా వైఎస్సార్‌సీపీకి దిమ్మ‌తిరిగే షాక్ అని చెప్ప‌వ‌చ్చు. చంద్ర‌బాబు అందుకున్న ఈ "మూడు మాట" త్వ‌ర‌లోనే ఏపీ అభివృద్ధికి దిశ‌-దెస‌ మార్చడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: