సాధార‌ణంగా ఈ దేశంలో 70 ఏళ్లు వ‌చ్చేస‌రికే శారీర‌కంగా, మాన‌సికంగా అలిసిపోయి, అన్నీ వ‌దిలేసుకుని ఇంటి ప‌ట్టునే గ‌డుపుతారు. కానీ, ఆయ‌న పంథా వేరు. వ‌య‌సు ముదిరినా, మ‌న‌సు మాత్రం పదునైంద‌ని, త‌న‌కు ఇంకా ప‌ట్టుద‌ల ఉంద‌ని నిరూపించారు. ఆయ‌నే 90 ఏళ్ల నారాయణన్ నాయర్. కేరళ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల సమరంలో... పార్టీల భీకర పోరుకు సవాల్ విసురుతూ, ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబ‌ర్‌గా పోటీ చేస్తున్నారు! ఆయ‌న సాహ‌సం ఇప్పుడు దేశ‌మంత‌టా ఒక హాట్ టాపిక్‌గా మారింది.


నెర‌వేర‌ని కోరిక‌... అందుకే ఈ సంచలనం! :
కేర‌ళ‌లోని ఆశ‌మ‌న్నూరు అయ్తే గ్రామ పంచాయతీలో రెండవ వార్డు నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నారాయ‌ణ నాయ‌ర్ బ‌రిలో నిల‌బ‌డ్డారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు జీవితంలో ఒకే ఒక తీర‌ని కోరిక ఉంద‌ట. అదే త‌న వార్డు అభివృద్ధి. ఇంతకాలం ఆ ప్రాంతాన్ని ఎవరూ సరిగా అభివృద్ధి చేయ‌లేద‌ని, అందుకే తానే స్వ‌యంగా ఎన్నిక‌ల్లో పోటీకి సై అంటున్నానని చెబుతున్నారు. తాను కనుక గెలిస్తే రెండవ వార్డును ప్రగతి పధంలో దూసుకుని పోయేలా చేస్తానని ఆయ‌న నమ్మకంగా చెబుతున్నారు. ఈ వార్డు బాగుపడాలంటే తాను నెగ్గాల్సిందేనని ఆయ‌న బలంగా విశ్వసిస్తున్నారు.



ఒంట‌రి పోరాటం.. ధైర్య‌మే బ‌లం! :
కేరళలో స్థానిక ఎన్నికల పోరు ఒక కురుక్షేత్రంలా సాగుతోంది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థులు అనుచరులు, అభిమానులతో జనం మధ్యకు వ‌స్తూంటే... స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన నారాయ‌ణ నాయ‌ర్‌కు ఎవరూ వెంట లేరు. దాంతో... ఆయ‌నే ఒంట‌రిగా, అలుపన్నది లేకుండా ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టి ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తున్నారు. వృద్ధాప్యం కార‌ణంగా ఆయ‌న స్వ‌రం వణుకుతున్నా, ఆయ‌న మ‌న‌సు, ప‌ట్టుద‌ల మాత్రం ఉక్కులా ఉన్నాయి. తన ఎన్నికల గుర్తు అయిన కెటిల్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్న ఆయ‌న ధైర్యం గురించి ఇప్పుడు రాష్ట్రం దాటి అంతా చ‌ర్చించుకుంటున్నారు.



వయసు అడ్డు కాదు: అద్భుత స్ఫూర్తి! :
"వయసు తన అభీష్టానికి అడ్డుకాదు" అని తేల్చిచెప్పిన నారాయ‌ణ నాయ‌ర్... ఏది చేయాల‌నుకున్నా, ముందుగా ప్రయత్నం చేయాలి త‌ప్ప‌, ఫ‌లితం గురించి భ‌య‌ప‌డకూడ‌ద‌నే సందేశాన్ని త‌న సాహ‌సం ద్వారా స‌మాజానికి అందించారు. ప్రధాన రాజకీయ పార్టీల అహంకారాన్ని, డబ్బు బలాన్ని ఒంట‌రి పోరాటంతో స‌వాల్ చేస్తున్న ఆయ‌న ఆత్మ విశ్వాసానికి డిసెంబ‌ర్ 13న వెలువ‌డే ఎన్నిక‌ల ఫ‌లితాలు ప‌ట్టం క‌డ‌తాయో లేదో చూడాలి. కానీ, 90 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న చేసిన ఈ పోరాటం మాత్రం ఎంద‌రికో ప్ర‌జ్వ‌లించే స్ఫూర్తిగా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: