7 జిల్లాలకు రెడ్ అలర్ట్: భయానక వాతావరణం! :
దిత్వా తుపాను ప్రభావంతో ముఖ్యంగా కింది ఏడు జిల్లాలపై తీవ్రమైన ప్రభావం ఉండబోతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం .. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు జల్లులు కురుస్తుండగా... సముద్రంలో అలల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద సూచికలు జారీ చేయడంతో... మరబోట్లు హార్బర్‌లకు చేరుకున్నాయి.
మంత్రులు రంగంలోకి: ప్రాణ నష్టం జరగకుండా..! :
తుపాను తీవ్రత దృష్ట్యా నెల్లూరు జిల్లాకు ఇప్పటికే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు నారాయణ చేరుకున్నారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, అధికారులకు అత్యవసర సూచనలు చేస్తున్నారు. జలాశయాలు, రిజర్వాయర్లు నిండుకుండలా ఉండటంతో... భారీ వర్షాలు కురిస్తే ప్రమాదం పొంచి ఉందని మంత్రులు కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం అన్ని సహాయక చర్యలను పటిష్ఠంగా చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. వరినార్లు నీటమునగడం, వరుస తుపాన్ల కారణంగా మూడు నెలలుగా చేపల వేట స్తంభించడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భీభత్సమైన వాతావరణంలో ప్రజలు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి