ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర మరింత చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ రంగంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారం చేపట్టిన వెంటనే అమలు చేస్తున్న మార్పులు ప్రజల్లో కొత్త సందేశాన్ని పంపుతున్నాయని, ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన వ్యవస్థలను ప్రజల మదిలో నుంచి మెల్లిగా తగ్గించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరైతే దీనినే “పాలి "ట్రిక్" లు” అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవల మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశం రాస్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సమావేశంలో ఉద్యోగులు, అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. .


పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చిన నిర్ణయాన్ని ఉద్యోగులు హర్షంతో స్వాగతించారు. దీర్ఘకాలంగా ఎదురు చూసిన పదోన్నతులు లభించడం పట్ల వారు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీడీవో వ్యవస్థ ఏర్పాటును కూడా వారు ప్రశంసించారు. అయితే పంచాయతీ కార్యదర్శులు తమ సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని, గ్రామ సచివాలయ ఉద్యోగులను పంచాయతీరాజ్ విభాగం నుంచి వేరు చేయాలని కోరారు.అదే విధంగా పంచాయతీరాజ్ శాఖలోనే డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం సరికాదని, జోనల్ సిస్టమ్ కారణంగా కొందరు ఉద్యోగులు పదోన్నతులకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ ముందు వివరించారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు ..


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ—తాను ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినని, ఉద్యోగుల కష్టాలంటే తనకు ప్రత్యేకమైన అవగాహన ఉందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పదోన్నతులు తనకు సరికాలేకపోయాయని, అందుకే వెంటనే వాటిని క్లియర్ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టు, ప్రతి బదిలీకి రేట్లు నిర్ణయించిన పరిస్థితి నెలకొనడం చాలా దురదృష్టకరమని విమర్శించడం కూడా ఈ సమావేశంలో ప్రధానాంశంగా నిలిచింది.అలాంటి వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని, ఇకపై నియామకాలు—బదిలీలు పూర్తిగా పారదర్శకతతో, సీనియారిటీ మరియు సిన్సియారిటీ ఆధారంగా మాత్రమే చేయాలని పవన్ అన్నారు. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించే విషయంపై కూడా శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ప్రకటించారు. పంచాయతీరాజ్ మరియు అనుబంధ విభాగాల్లో దాదాపు రెండు లక్షల మంది పనిచేస్తున్నారని, అందరి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


ఇదంతా జరుగుతుండగా, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు ఓ వ్యూహాత్మక రాజకీయ కదలికలా కనిపిస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను ప్రజల జీవితాల నుంచి మెల్లగా తగ్గించి, పంచాయతీరాజ్ వ్యవస్థను తిరిగి కేంద్రంలోకి తీసుకొచ్చేందుకు పవన్ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజా పరిపాలనలో పునర్ వ్యవస్థీకరణ పేరుతో, ప్రజల్లో జగన్ పేరును మెల్లగా మర్చిపోయేలా చేసే ప్రయత్నమిదేనని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.ఏదేమైనా… పవన్ కళ్యాణ్ ప్రతిరోజూ తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల్లో నెలకొంటున్న నమ్మకం, రాజకీయ ప్రతిస్పందనలు—అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొత్త దిశగా మళ్లిస్తున్నాయని చెప్పడానికి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ మార్పులు ఏ విధమైన ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: