తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య సాగుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు పరాకాష్టకు చేరింది. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు కేసీఆర్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. కేసీఆర్ అహాన్ని దెబ్బకొడుతూనే, ప్రజల్లో తనను తాను ఒక ప‌రిణితి చెందిన రాజ‌కీయ‌ నాయకుడిగా మలుచుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ వేసిన గూగ్లీలు మరియు బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీరుపై ఇప్పుడు హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


ప్రజాభవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌ను రాజకీయంగా ఆత్మరక్షణలో పడేశాయి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు రాకుండా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఆయన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరడం ద్వారా రేవంత్ తన ఇమేజ్‌ను  మర్యాద రామన్న లా మార్చుకున్నారు. నేను ఇంత మర్యాద ఇస్తుంటే, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు ? అనే ప్రశ్నను ప్రజల మనసుల్లో నాటడంలో రేవంత్ విజయం సాధించారు.


కేసీఆర్ తనను తాను రేవంత్ కంటే ఎన్నో మెట్లు పైన ఉంటానని భావిస్తారు. అలాంటి తన గౌరవాన్ని రేవంత్ కాపాడతానని చెప్పడం కేసీఆర్‌కు ఒక రకమైన అవమానంగా తోచే ప్రమాదం ఉంది. తన కంటే జూనియర్ అయిన రేవంత్ భరోసా ఇస్తేనే తాను అసెంబ్లీకి వెళ్లాలా ? అనే ఈగో కేసీఆర్‌ను సభకు రాకుండా అడ్డుకోవచ్చు. సరిగ్గా ఇదే రేవంత్ రెడ్డికి కావలసింది. కేసీఆర్ రాకపోతే "ఆయనకు చర్చించే ధైర్యం లేదు" అని, వస్తే "రేవంత్ చెప్పినట్టుగా వచ్చారు" అని ప్రచారం చేసుకునే అవకాశం రేవంత్‌కు దక్కుతుంది. గత పదేళ్లలో అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేశారన్న విమర్శలు ఉన్నాయి. కానీ రేవంత్ హయాంలో బీఆర్ఎస్ నేతలకు తగిన సమయం ఇస్తూ, వారి వాదనలు వింటూ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడుపుతున్నారన్న భావన కలిగిస్తున్నారు.


వేశం కంటే ఆలోచనతో రేవంత్ అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఆయన ఎంచుకున్న మార్గం చాలా సున్నితంగా, అదే సమయంలో అత్యంత ప్రభావవంతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై గళం విప్పితేనే పార్టీ కేడర్‌లో ధైర్యం పెరుగుతుంది. కానీ రేవంత్ వేసిన 'ట్రాప్'లో చిక్కుకుంటామన్న భయంతో ఆయన వెనకడుగు వేస్తే, అది రేవంత్ రెడ్డికి మరో విజయం అవుతుంది. రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగు కేసీఆర్ రాజకీయ అనుభవాన్ని సవాల్ చేస్తోంది. రేవంత్ ఆడుతున్న ఈ పాజిటివ్ పాలిటిక్స్ గేమ్‌ను తిప్పికొట్టే శక్తి ప్రస్తుతానికి బీఆర్ఎస్‌లో కనిపించడం లేదు. కేసీఆర్ ఈ గూగ్లీని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: