2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నేతలు, మాజీ మంత్రులు పార్టీని విడిచి ఇతర పార్టీలలోకి చేరారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి కష్టకాలంలో పార్టీని విడిచి కూటమి పార్టీలోకి జంపింగ్ చేసిన నేతలపైన తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళవారం ధర్మవరంలో జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.


పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పక్కకు తప్పుకున్న వారిని ఉద్దేశిస్తూ కేతిరెడ్డి మాట్లాడారు.. మన దగ్గర ఉండి సంపాదించుకొని ఇప్పుడు పదవుల కోసం వెళ్లిపోయిన వారిని మళ్లీ తిరిగి రానిచ్చే ప్రసక్తే లేదు.. బంధువులు, స్నేహాల పేరుతో మళ్లీ వైసీపీలోకి వస్తాము అంటే గేటు దగ్గరే వారి ముఖం మీద చెప్పు సైజు ముద్రపడేలా కొడతామంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాజకీయాలలో నైతికత అనేది ఉండాలని వెన్నుపోటు పొడిచిన వారి పైన ఫైర్ అయ్యారు.


ఎదురుగా నిలబడి పోరాడే శత్రువునైన కానీ గౌరవిస్తాం, అవసరమైతే వారిని పార్టీలో చేర్చుకుంటాము. కానీ మన దగ్గర నుండి దోచుకొని పార్టీని ముంచేసి వెళ్లిపోయిన  క్యారెక్టర్ లేని వారిని మాత్రం అసలు దగ్గరకు రానివ్వమంటు తెలిపారు. పార్టీ అధికారం కోల్పోయిన వెన్నంటే ఉన్న కార్యకర్తలకు సైతం కేతిరెడ్డి పూర్తి భరోసాని ఇచ్చేశారు. పదవుల కోసం వెళ్లిన వారిని నమ్మే స్థితిలో పార్టీ లేదని కేవలం పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాలలో క్యారెక్టర్ ముఖ్యమని ఆ క్యారెక్టర్ లేని వాళ్ళుకి వైసీపీ  తలుపులు మాత్రం శాశ్వతంగా మూసుకుపోయాయంటూ తెలియజేశారు. ప్రస్తుతం కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలోని మరొకసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: