తెలంగాణలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి జలక్ తగిలింది. టీఆర్ఎస్ కు దీటుగా టీడీపీ కూడా స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. ఐదు జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతాల్లోనూ టీడీపీ జెండా ఎగరేసిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 9 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోటీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకుంది. 

కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం గెలుచుకుని ఉనికి చాటుకుంది. అధికారం చేతిలో ఉన్నా మొత్తం 9 స్థానాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోలేకపోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ మండలం వట్టినాగులపల్లిలో టీడీపీ విజయం సాధించింది. సరూర్‌నగర్‌ మండలం జల్‌పల్లి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు.

తెలంగాణలో గాలి మారుతోందా..?

Image result for ntr trust bhavan
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో టీడీపీ విజయం సాధించింది. ఇక టీఆర్‌ఎస్‌కు గట్టి పట్టున్న వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీ ఎన్నికలోనూ టీడీపీ అభ్యర్థే విజయం సాధించారు.  పాలమూరు జిల్లాలో ఉప ఎన్నికలు జరిగిన రెండు ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌, టీడీపీలు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని మద్దూరు మండలం భూనీడు ఎంపీటీసీ ఎన్నికలో టీడీపీ గెలుపొందింది. 

వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. నవాబ్‌పేట మండలం కూచూరు ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవశం చేసుకుంది. ఇక సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో సదాశివపేట మండలం పెద్దాపూర్‌ ఎంపీటీసీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ముసిపట్ల ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుచుకున్నారు. తెలంగాణలో గాలి మారుతోందని.. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని టీడీపీ నేతలు ఖుషీ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: