అవును చాలామందకి నచ్చకపోయినా వాస్తవం మాత్రం ఇదే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు, మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేతకానితనం, రాష్ట్రప్రయోజనాలపై రాజీపడటమే రాష్ట్రాభివృద్ధికి శాపాలుగా మారింది. విశాఖ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందంటే వీళ్ళ చేతకానితనాన్ని చూసుకునే అని అర్ధమైపోతోంది. మొట్టమొదటి సీఎం చంద్రబాబు మొదటినుండి ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు 2014లో బయటపడిన ఓటుకునోటు కేసులో చంద్రబాబు  ఇరుక్కున్నారు. దాంట్లో నుండి బయటపడటం ఎలాగో తెలీక చివరకు కేంద్రప్రభుత్వానికి సాగిలపడిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఆపేసినా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారు.



చంద్రబాబు చేతకానితనానికి, మోడి మొండి వైఖరికి ఏపి ప్రయోజనాలు దెబ్బ తినేశాయి. ఇక జగన్ విషయం చూస్తే కేసుల్లో నుండి బయటపడటానికి మోడి ముందు సాగిలపడిపోయినట్లే అనుమానంగా ఉంది. జగన్ మీదపడిన కేసులు తప్పో ఒప్పో ఏదైనా కానీండి ముందైతే అందులో నుండి బయటపడాలి కదా. ఈ నేపధ్యంలోనే రాష్ట్రప్రయోజనాలకు సంబంధించిన ఏ విషయంలో కూడా మోడిని గట్టిగా నిలదీయలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయంలో కోత విధించేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పినా లేఖలు రాయటం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. ప్రత్యేకహోదాకు లేఖలు రాయటం తప్ప మరేమీ చేయటం లేదు.  అంటే చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏకంగా రాష్ట్రప్రయోజనాలను గాలికి వదిలేశారనే అభిప్రాయం జనాల్లో పెరిగిపోతోంది.



తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్రలో మంటలు మండిస్తోంది. అసలు కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే అధికారంలో ఉన్న జగన్ వ్యతిరేకించలేడు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబూ నోరెత్తే పరిస్దితి లేదు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే మోడి ఏపిని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. క్షేత్రస్ధాయిలో ఆందోళనలు మొదలైపోయినా ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్న మోడిని ఏమి అనకుండా జగన్ పై చంద్రబాబు ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. ఇదే విషయం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తీసుకునుంటేనా ? ఈపాటికే మోడికి వేడి మొదలైపోయేదేనటంలో సందేహమే లేదు. జల్లికట్టు నిషేధం సందర్భంగా ఏమి జరిగిందో అందరు చూసిందే. మొత్తానికి జగన్ , చంద్రబాబుల వైఖరే రాష్ట్రానికి శాపాలుగా మారిందనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: