మామూలుగా సంచైతా గజపతిరాజు మంచి  జోరుమీదుంటుంది. తనపై ఎవరైనా నోరుపారేసుకున్నా, ఆరోపణలు చేసినా, విమర్శించిన వెంటనే దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఫిట్టింగ్ రిప్లై ఇవ్వటానికి రెడీగా ఉంటుంది.  తన మాటలతోను, ఎదురుదాడి కారణంగానే మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైత ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకుంది.  అంతకముందు ఎలాగుండేదో తెలీదు కానీ మాన్సాస్ ట్రస్టుకు ఛైర్ పర్సన్ అయిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.  సొంత బాబాయ్, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్టు  మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు మీద కానీ లేకపోతే చంద్రబాబునాయుడు, నారా లోకేష్ మీద కాని ఒంటికాలి మీద లేవటంలో ఈ ఛైర్ పర్సన్ ఏమాత్రం ఆలస్యం చేయదు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ హ్యాండిల్ ను చూస్తే ఎవరికైనా అర్ధమైపోతోంది.




ఇటువంటి సంచైతా మేడమ్ కూడా ఎందుకనో మూడు రోజులుగా నోరిప్పటం లేదు. పైడితల్లి అమ్మవారు  సిరిమానోత్సవంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. సిరిమానోత్సవాన్ని చూసేందుకు ఆనందగజపతిరాజు రెండో భార్య సుధా గజపతిరాజు, కూతురు ఊర్మిళా గజపతిరాజు  విజయనగరంలోని పూసపాటి వారి కోటమీదకు చేరుకున్నారు. సుధా అంటే సంచైతకు  సవతి తల్లి, ఊర్మిళంటే సవతి సోదరి అవుతారు. సిరిమానోత్సవరం ఊరేగింపు సరిగ్గా కోట ముందుకు వచ్చేసరికి సంచైత వీళ్ళద్దరిపై నోరు పారేసుకున్నదట. వీళ్ళద్దరిని కోట మీదకు ఎవరు రానిచ్చారంటూ అక్కడున్న పోలీసులు, సిబ్బందిని అరిచిందట. దాంతో అవమానంగా భావించిన వీళ్ళు అక్కడి నుండి వచ్చేశారు.



తమకు జరిగిన అవమానాన్ని స్వయంగా ఊర్మిళ తన ట్విట్టర్లో చెప్పుకుని బాధపడ్డారు.  తమ విషయంలో సంచైత వ్యవహరించిన తీరును ఆమె తప్పుపడుతు ట్విట్టర్లో కామెంట్ చేశారు. తర్వాత తమకు జరిగిన అవమానం, అన్యాయానికి నిరసనగా కోటలోనే బుధవారం ఆందోళన కూడా చేశారు.  తమకు వాదననతో పాటు  సంచైత చేసిన అవమానాన్ని రెండు రోజులుగా తల్లీ, కూతుళ్ళిద్దరు వరుసబెట్టి మీడియా ఇంటర్వ్యూల్లో వివరించి చెబుతున్నారు. సంచైత వ్యవహారంపై మండిపోతున్నారు. మరి తనకు వ్యతిరేకంగా మీడియాలో ఇంతగా రచ్చ జరుగుతున్నా సంచైతా మేడమ్ ఎందుకని నోరిప్పటం లేదు ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. చిన్న కామెంటుకు కస్సుమని అంతెత్తున లేచిపడే ఛైర్ పర్సన్ మూడు  రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.




అంటే జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే  తను చేసిన తప్పును సంచైత అంగీకరిస్తున్నట్లే ఉంది. పైగా ఘటన జరిగినపుడు సాక్ష్యులుగా పోలీసులు, మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు కూడా ఉన్నారని తల్లీ, కూతుళ్ళే చెబుతున్నారు. కాబట్టి తనపై బురదచల్లుతున్నారని సవతి తల్లీ, సోదరిలపై సంచైత ఎదురుదాడి  చేసేందుకు లేదు. అలాగని వీళ్ళ ఆరోపణలను ఖండించాలంటే మళ్ళీ మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఎలాగూ జరిగిపోయిందేదో జరిగిపోయిందన్న పద్దతిలో మళ్ళీ కెలుక్కోవటం ఎందుకులే అన్నట్లుగ సంచైత వ్యవహరిస్తున్నట్లుంది. అందుకనే పెద్దవాళ్ళు ‘కాలు జరితే వెనక్కు తీసుకునే అవకాశం ఉంది కానీ నోరుజారితే మాత్రం అవకాశం లేద’ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: