
ప్రధానమంత్రి నరేంద్రమోడికి వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ రాజు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పూర్తిగా వివరించారట. ప్రభుత్వ ఖర్చుతో చర్చీలను నిర్మిస్తున్న వైనాన్ని వివరించారట. అదివిని మోడి కూడా హాస్చర్యపోయారట. నిజమేనా, ప్రభుత్వ ఖర్చులతో చర్చీల నిర్మాణమంటే చాలా ఘోరమో అని మోడి కూడా నిట్టూర్చారట. రాష్ట్ర ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహించటం కోసం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందని కూడా ఫిర్యాదు చేశారట. రాష్ట్రప్రభుత్వమే మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని ఎంపి చెప్పగానే అందుకు తగిన ఆధారాలను ఇవ్వాలని కూడా కోరారట.
తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయటానికి ప్రధాని ఆశీర్వాదాలు కోరారట. వెంటనే మోడి కూడా ఇచ్చేశాను ఫో అన్నారట. మీ చేతుల మీదగా జరిగిన శంకుస్ధాన కార్యక్రమాన్ని జగన్ అధికారంలోకి రాగానే దుంపనాశనం చేశాడని ఫిర్యాదు చేశారట. మోడి కూడా పాపం నిట్టూర్చారట. అమరావతికి మద్దతుగా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనను జగన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదని కూడా ఎంపి ఫిర్యాదు చేయటం, మోడి అది వినటం విచిత్రంగానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం అంటే కేవలం హిందువులకు మాత్రమే అని క్రైస్తవులను, ముస్లింలను పట్టించుకోకూడదని మరి ఏ రాజ్యాంగంలో ఎంపి చదివారో తెలీదు. ప్రభుత్వ ఖర్చులతో చర్చీల నిర్మాణం తప్పయితే మరి అధికారంలోకి వస్తే ప్రభుత్వమే జెరూసలేంకు జనాలను పంపుతుందని నాగాల్యాండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎలా చెప్పింది ?
ఇక ప్రభుత్వమే మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలతో పాటు ఇపుడు తిరుగుబాటు ఎంపి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఏ గ్రామాల్లో మతమార్పిడులు జరిగాయి, ప్రభుత్వం తరపున పాల్గొన్నవారు ఎవరు అన్న విషయాలను మాత్రం ఎవరు చెప్పటం లేదు. జగన్ క్రిస్తియన్ కాబట్టి హిందువ్యతిరేకి అనే ముద్ర వేయటమే టార్గెట్ గా కనిపిస్తోంది. ఇక ఫైనల్ గా అమరావతి రైతుల ఆందోళనను జగన్ పట్టించుకోవటం లేదని చెప్పటం రోలు గురించి మద్దెలకు ఫిర్యాదు చేయటం లాగే ఉంది. ఎందుకంటే గడచిన మూడు నెలలుగా ఢిల్లీ శివారు ప్రాంతంలో రైతుల ఉద్యమాన్ని మోడి పట్టించుకోని సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది రాజధాని ఆందోళనపై మోడితో ఎంపి ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది.