దేవుడి ప‌ట్ల విశ్వాసం ఉన్న వారికి స‌హ‌జంగానే కొన్ని సందేహాలుంటాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది భ‌గ‌వంతుడి దివ్య‌రూప ద‌ర్శ‌నం. దేవుడు క‌నిపించాల‌నే కోరిక అంద‌రిలో ఉంటుంది. దీంతో పాటుగా కొన్ని సందేహాలు కూడా స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తాయి. అందులో కొన్ని...‘దేవుడు నిజంగా ఉంటే అందరికీ కనిపించాలి కదా! ఎందుకు కనిపించడు? కాబట్టి, దేవుడు లేడని నిర్ధారించుకోవచ్చు’ అనే కామెంట్లు. ఇలాంటి వాళ్లకు భగవద్గీతలో పరమాత్మ చక్కని సమాధానమిచ్చారు.

 

‘నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా/ శక్యం ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ (53-11), భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో ర్జున/ జ్ఞాతుం ద్రష్టుం చ తత్తేన ప్రవేష్టుం చ పరంతప’ ॥ (54-11). భక్తి, శ్రద్ధ, తపన, అంకితభావం ఇవేవీ లేకుండా పేరుకు మాత్రం దానధర్మాలు, పూజలు పురస్కారాలు, విద్యాసాధన, గ్రంథపఠనాలు చేసినంత మాత్రాన దేవుడు కనిపించడు. ఆయనను మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా విశ్వసించాలి. మనలోని ఆత్మ ఎంత నిజమో, పరమాత్మ కూడా అంతే నిజమని నమ్మాలి. భౌతిక నేత్రాలకు కనిపించకున్నా ‘నిజంగా ఉన్నాడు’ అన్న భావన మనసునిండా ఏర్పరచుకోవాలి. ఆధ్యాత్మిక సాధన స్వార్థ రహితంగానే సాగాలి. పరమాత్మ తప్ప మరో ధ్యాస, కోర్కె లేని స్థితికి చేరుకోవాలి. అప్పుడు వారు ధ్యానించే రూపంలో తప్పక దేవుడు కనిపిస్తాడు. ఆ పరమాత్మ రూపం తోటి మనిషిలో కావచ్చు. జ్యోతి స్వరూపంగానైనా కావచ్చు.

 

ఇక కీల‌క‌మైన వేదమంత్రాల విష‌యంలోనూ కొన్ని సందేహాలు ఉంటాయి. వేద‌మంత్రాలు ఎలా ప‌ఠించాలి అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దానికి స‌మాధానం ఆ మంత్రాల‌ను చక్కని ఉచ్ఛారణతో, అర్థయుక్తంగా పఠించాలి. తప్పులు చదువకూడదు. శబ్ద ఉచ్ఛారణ దోషాలు మహాపాపం. వేదమంత్రాల శక్తితో పరమాత్మ సంతుష్ఠుడవుతాడు. ఫలితంగా మానవుల కామితార్థాలు నెరవేరుతాయి. దివ్యజ్ఞాన పరమార్థం వేదశబ్దాలలోనే ఉంటుంది. వేదమంత్రాలను సశాస్త్రీయంగా వినిపించాల్సిన బాధ్యత విద్వాంసులదే. ఈ చరాచర సృష్టిలో వేదమంత్రాల నడుమ నిర్వహించే హోమంలో సర్వప్రాణుల ప్రసన్నత కోసం భౌతికాగ్ని యుక్తంగా మంత్రాల శక్తిని వాడతారు. ముఖ్యంగా హోమాగ్నికి ఏడు నాలుకలుంటాయి. ‘కాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) తెలుపు రంగును ప్రకాశింపజేస్తుంది. ‘కరాలీ’ అనే నాలుక (అగ్నిజ్వాల) అతికఠినమైంది. ‘మనోజవా’ అనే నాలుక (అగ్నిజ్వాల) మనోవేగవంతం. ‘సులోహితా’ నాలుక (అగ్నిజ్వాల) అగ్నికణాలను విడుదల చేస్తుంది. ‘విశ్వరూపి’ అనే జిహ్వ (అగ్నిజ్వాల) అన్ని రంగులనూ కలిగి ఉంటుంది. ఈ జిహ్వాగ్ని జ్వాలలనుండి ఉద్భవించే శక్తి తరంగాలు అత్యంత తేజోవంతమైనవి. ఈ హోమజ్వాలల ద్వారా మానవుడు విశేష ఫలాలను పొందుతాడు. అందుకే నిష్ట‌తో మంత్రాలు ప‌ఠించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: