తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకన్న స్వామికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. శ్రీవారికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి భక్తులకు కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. స్వామివారి నైవేద్యానికి సంబంధించిన చాలా సమాచారం అతి తక్కువ మందికే తెలుసని శ్రీ రమణ దీక్షితులు ‘ది సీక్రేట్ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే పుస్తకంలో రాశారు. 
 
శ్రీవారి ఆలయంలో నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుందని.... ఇది స్వామివారి భోజనానికి పిలుపుగా భావిస్తారని పేర్కొన్నారు. రోజుకు మూడు పూటలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారని.... ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారని... పది, పదకొండు గంటల మధ్య రాజభోగం సమర్పిస్తారని రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారని అన్నారు. 
 
తిరుమల గర్భగుడిలోని స్వామివారి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు అని పేర్కొన్నారు. స్వామివారి మూల విగ్రహానికి అనుగుణంగా స్వామివారికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారని అన్నారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు ప్రసాదాలను పెంచుతున్నారని చెప్పారు. ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారని చెప్పారు. 
 
మరోవైపు లాక్ డౌన్ అనంతరం ఈ నెల 11 నుంచి భక్తులకు టీటీడీ దర్శనాలకు అనుమతులు ఇవ్వనుంది. కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే భక్తులను అనుమతించబోమని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అలిపిరి నడకదారిలో భక్తులకు అనుమతి ఇస్తామని... ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: