
వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిండివంటలు, రకరకాల పాయసాలు, లడ్డూలు, పండ్లు అన్నీ మనం ఎంతో శ్రద్ధగా చేసి పూజ సమయంలో నైవేద్యంగా సమర్పిస్తాం. అరిటాకులో ప్రసాదం పెట్టి "గణపయ్యా, ఆరగించవయ్యా, మా కోరికలు నెరవేర్చవయ్యా" అంటూ భక్తితో ప్రార్థిస్తాం. కానీ పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాలను గౌరవంగా స్వీకరించి తినాల్సిన చోట, చాలా మంది వాటిని నిర్లక్ష్యంగా పక్కన పెట్టేస్తారు. కొంతమంది ప్రసాదం పాడవకముందే తినేస్తారు. కానీ చాలామంది ఆర్భాటంగా ఎక్కువ చేస్తారు గానీ, వాటిని పూర్తిగా తినలేరు. మరికొందరు వాటిని ఎవరికి ఇవ్వరు కూడా .. పక్కింటివారికి, పొరుగింటివారికి, చిన్నపిల్లలకు పంచడం బదులుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. రెండు మూడు రోజులు గడిచాక అవి పాడైపోతే చెత్తకుప్పలో పడేస్తారు.
అలా చేయడం చాలా పెద్ద పాపమని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం దేవుడికి ఎంత పవిత్రంగా చేసి పెట్టామో, ఆయన నామంతో సమర్పించిన ఆ నైవేద్యం ఇకపై “దైవ ప్రసాదం” అవుతుంది. ఆ ప్రసాదాన్ని చెత్తలో పడేయడం, నిర్లక్ష్యం చేయడం దేవుడిని అవమానపరచడమే అవుతుంది. అందుకే పండితులు .. దేవుడికి సమర్పించిన ప్రతి నైవేద్యాన్ని పవిత్రంగా భావించి మనమే తినాలి. మనకు మిగిలితే బంధువులకు, పొరుగువారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు పంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తలో వేయకూడదు. సిటీల్లో నివసించే వారు "రేపు తినేద్దాం" అంటూ ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతారు. ఆ తర్వాత అది పాడైపోతే నిర్లక్ష్యంగా చెత్తలో వేసేస్తారు. కానీ ఇది అత్యంత తప్పు. దేవుడికి సమర్పించిన ఆహారాన్ని ఆహ్లాదంగా, పవిత్రంగా మనమే స్వీకరించడం మన బాధ్యత. అది మనకు శరీరానికీ, ఆత్మకీ శుభప్రదం అవుతుంది.
ఏ దేవుడికి చేసిన నైవేద్యం, ప్రసాదం చాలా చాలా పవిత్రం అని గుర్తుంచుకోవాలి. అది కేవలం ఆహారం కాదు, దేవుడి కృపగా ఇచ్చిన ఆశీర్వాదం. అందుకే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా గౌరవంగా స్వీకరించాలి. దేవుడి ప్రసాదాన్ని చెత్తకుప్పలో పడేయడం మహాపాపమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.