బాలీవుడ్ నటి  కరీనా కపూర్ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను మెల్‌బోర్న్‌లో ఆమె ఆవిష్కరించారు.వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు ముందే మహిళల టీ20 టోర్నీ జరగనుంది. 


 కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ "ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరుపున ఆడుతున్న మహిళలందరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు రాణించడాన్ని చూడటం నిజంగా చాలా శక్తినిస్తుంది. వారు మనందరికీ స్ఫూర్తిదాయకం" అని అన్నారు."భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన గొప్ప క్రికెటర్లలో దివంగత మా మామగారు ఒకరు. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉంది" అని కరీనా కపూర్ ఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ మున్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమారుడు అన్న సంగతి తెలిసిందే.


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-1లో ఉన్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-2లో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది.


క్వాలిఫైయర్ మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 8 వరకు జరగనుండగా.. సెమీఫైనల్స్ నవంబర్ 11, 12 తేదీల్లో జరుగుతాయి. నవంబర్‌ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు. మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో పాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇందులో టాప్-8 జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: