టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి అతని వ్యక్తిగత జీవితంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన భార్య హసీన్ జహాన్ వేసిన భరణం కేసులో కలకత్తా హైకోర్టు జూలై 1, 2025న కీలక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ప్రకారం, షమీ తన మాజీ భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె ఐరా సంరక్షణ కోసం రూ.2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.4 లక్షల భరణం షమీ చెల్లించాల్సి ఉంటుంది.

కోర్టు తీర్పు ప్రకారం, ఈ మొత్తాన్ని 2018లో కేసు దాఖలు చేసిన నాటి నుంచి వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే గత ఏడు సంవత్సరాల కాలానికి బకాయి మొత్తం కూడా షమీ చెల్లించాల్సి ఉంటుంది. న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ ఈ తీర్పును వెలువరించారు. హైకోర్టు తీర్పు జారీ చేసిన అనంతరం షమీకి మానసికంగా ఇది పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

మహ్మద్ షమీ, హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత 2015లో వారికి కుమార్తె ఐరా జన్మించింది. కానీ 2018లో వీరి మధ్య గడచని రోజుల కథ మొదలైంది. హసీన్ జహాన్ భర్తపై గృహ హింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వరకు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. దీంతో షమీ కెరీర్‌కే ఊహించని ముప్పు వచ్చిందని భావించవచ్చు.

అలిపోర్ కోర్టు 2018లో షమీ నెలకు భార్యకు రూ.50,000, కుమార్తెకు రూ.80,000 చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. అయితే ఈ మొత్తంతో సరిపోదంటూ హసీన్ జహాన్ నెలకు రూ.10 లక్షలు (తనకు రూ.7 లక్షలు, కూతురికి రూ.3 లక్షలు) కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆదాయపు పన్ను వివరాల ప్రకారం షమీ 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.7.19 కోట్లు ఆదాయం పొందినట్లు కోర్టుకు తెలిసింది. ఇది నెలకు సుమారు రూ.60 లక్షల వరకూ వస్తుంది. ఈ నేపథ్యంలో షమీ ఆదాయ స్థితిని పరిగణనలోకి తీసుకుని, భార్య కూతురి భవిష్యత్‌ కోసం భరణాన్ని పెంచింది. హసీన్ జహాన్ తిరిగి వివాహం చేసుకోలేదన్న అంశం, కుమార్తెను తానే చూసుకుంటోందన్న అంశాలు కోర్టు తీర్పులో కీలక పాత్ర పోషించాయి.

హసీన్ జహాన్ చేసిన ఆరోపణల కారణంగా షమీపై అప్పట్లో bcci కూడా దర్యాప్తు చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై ప్రత్యేక దృష్టి సారించగా, చివరికి షమీకి క్లీన్ చిట్ ఇవ్వబడింది. ఆ తర్వాత షమీ మళ్లీ జట్టులోకి వచ్చి, ఇటీవల 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆయన ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు గాయం కారణంగా దూరంగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: