- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద నిజంగానే మెగా ర్యాంపేజ్ సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా చిరు వింటేజ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.


రికార్డు వసూళ్లు - రూ. 84 కోట్ల గ్రాస్ :
నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన ప్రకారం, మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 84 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిరంజీవి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. తొలి రోజు భారతదేశంలో సుమారు రూ. 28.5 కోట్లు వసూలు చేయగా, ప్రీమియర్లతో కలిపి ఆ మొత్తం రూ. 37.1 కోట్లకు చేరింది. అమెరికాలో 1.7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో చిరంజీవి తన పాత రికార్డులను (వాల్తేరు వీరయ్య, సైరా) దాటే దిశగా దూసుకుపోతున్నారు.


సంక్రాంతి పోటీ - బాక్సాఫీస్ వద్ద ఆధిక్యం :
సంక్రాంతి రేసులో ద రాజా సాబ్‌ లాంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'నారి నారి నడుమ మురారి', మరియు 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు లైన్‌లో ఉన్నా, మెగా మూవీకి ఉన్న పాజిటివ్ టాక్ దృష్ట్యా దీని వసూళ్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో విక్టరీ వెంకటేష్ సుమారు 20 నిమిషాల పాటు కనిపించే ప్రత్యేక పాత్ర ( వెంకీ గౌడ ) సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిరు - వెంకీ స్క్రీన్ షేరింగ్ థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. బుక్ మై షోలో తొలిరోజు దాదాపు 4.88 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: