స్మార్ట్ఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ హువావే అద్భుతమైన ఫీచర్లతో కొత్త మొబైల్ ను లాంచ్ చేయబోతుంది. హువావే నోవా 7ఐ పేరిట వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనుంది. ఓ ప్రముఖ మలేషియన్ టెక్ వెబ్ సైట్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొదట ఈ స్మార్ట్ఫోన్ను మలేషియాలో లాంచ్ అవుతోంది. ఇది మిడ్ రేంజ్ ఫోన్ అని, 48 మెగా పిక్సెల్ కెమెరాను ఇందులో వెనకవైపు అందిస్తున్నారని ఈ వెబ్ సైట్ పేర్కొంది
ఇక వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ హువావే నోవా 7ఐ స్మార్ట్ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, కిరిన్ 810 ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నారు. బ్లాక్, పింక్, గ్రీన్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్కభాగంలో ఉండనుంది. అలాగే ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండనుంది.
ఇందులో వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా ‘మీ టైమ్’ అనే ఫీచర్ ను అందించారు. ఈ ఫీచర్ ద్వారా లైటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ ఆడియో, వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని హువావే చెబుతోంది. చైనాలో ఆ స్మార్ట్ ఫోన్ ధర 2,199 యువాన్లుగా అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.22,300గా ఉంది. అయితే చైనాలో కాకుండా ఇతర దేశాల్లో మొదట లాంచ్ కానున్న మొట్టమొదటి హువావే స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం.