మన తెలంగాణాలో మద్యం లేని ఊరు ఉండదు.. ఇది అందరికీ తెలిసిన మాట.. కానీ చాలామందికి తెలియని ఓ విషయం ఏమిటంటే.. మన ఇదే తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలోని ప్రజలు మద్యం ముట్టుకోరు.. అసలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కరు.. ఇంతకీ అదెక్కడ అనేదేగా మీ డౌట్..! అక్కడికే వస్తున్నా..! తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ.. పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి.గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది లేదు.

తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు.గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు.అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు.

 అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు.ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు వాళ్ళ మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతారు. అందుకే ఈ ఊరి వాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు.చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటారు.. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా..ఓ ఆదర్శ గ్రామంగా పిలవబడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: