నిన్న మొన్నటి వరకూ వర్షాలు విరజిమ్మిన ఆకాశం ఇప్పుడు చలిగాలులతో వణికిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు చలి కమ్మేసిన చలికాలానికి సిద్ధమవుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి గాలులు దుమ్ము రేపుతుంటే, ఉదయం తొమ్మిది గంటల వరకూ ఆ వణుకు ఆగడం లేదు. ప్రజలు జాకెట్లు, షాల్లు, దుప్పట్లతో బయటకు అడుగుపెడుతున్నారు. మొంథా తుపాన్ ప్రభావం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు నవంబర్ మధ్య వరకు కొనసాగాలి. కానీ మొంథా తుపాన్ వల్ల అవి ముందుగానే ముగిశాయి. సెప్టెంబర్ 14న నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమై, అక్టోబర్ 15 నాటికి పూర్తయింది. ఆ వెంటనే ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ నెల మొదటి వారంలోనే తగ్గిపోయాయి. ఫలితంగా రాష్ట్రాల్లో తేమ తగ్గి, పొడి వాతావరణం ఏర్పడి చలి ప్రభావం పెరిగింది.



ఆంధ్రప్రదేశ్‌లో చలి కాటేస్తోంది .. ఏపీలో చలి రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు మంచు కప్పుకున్నట్టుగా మారాయి. రాత్రివేళ గాలి చీల్చే చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇస్రో అంచనాల ప్రకారం, కొత్తగా అల్పపీడనం లేకపోతే మరో పదిహేను రోజులపాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పది జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఇది గత ఏడు సంవత్సరాల్లోనే అత్యంత చల్లటి వాతావరణంగా నమోదవుతుందన్న అంచనా నిపుణులది.



తెలంగాణలో కూడా వణుకు వాతావరణం .. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నవంబర్ 11 నుంచి 19 వరకు తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరగనుంది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌ వరకు పడిపోవచ్చని హెచ్చరికలు వెలువడ్డాయి. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14–17 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. సాధారణంగా ఇంత కాలం చలి కొనసాగదు, కానీ ఈ ఏడాది కనీసం 8–10 రోజులపాటు వణికించే వాతావరణం ఉండనుందని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.



హైదరాబాద్‌లో ఉదయం పొగమంచు దట్టంగా కనిపిస్తోంది. 9 గంటల వరకు సూర్యరశ్మి స్పష్టంగా కనిపించకపోవడం, చలిగాలులు ఎముకలదాకా చొచ్చుకుపోవడం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వృద్ధులు, చిన్నారులు, రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మొంథా తుపాన్ వెళ్లిన తర్వాత తేమను కరగొట్టి, చలిని బలపరిచిన ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందన్నది స్పష్టం. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు వర్షాల ఊరట తర్వాత చలిగాలుల సవాల్ ఎదుర్కొంటున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: