మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ఒక అమాయకపు వ్యక్తి (బాధితుడు) టార్గెట్‌గా ఈ కథ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కదకంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు కిలాడీలు పక్కా ప్లాన్‌తో ఈ గ్రామంలో అడుగుపెట్టారు. వీరికి మాటలతో మాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. బాధితుడి వద్దకు వెళ్లిన ఈ ముగ్గురు.. ఆయనకు లేనిపోని ఆశలు కల్పించారు."నీ ఇల్లు సామాన్యమైనది కాదు.. ఈ ఇంటి కింద పాతాళంలో భారీగా గుప్త నిధులు ఉన్నాయి. సాక్షాత్తూ లక్ష్మీదేవి నీ ఇంటి గడప తొొక్కబోతోంది. కాకపోతే ఆ నిధులు బయటకు తీయాలంటే కొన్ని శక్తివంతమైన పూజలు చేయాలి. ఆ పూజలు చేస్తే చాలు.. నీ దరిద్రం వదిలిపోతుంది, బంగారం నీ ఇంట్లో కురుస్తుంది" అంటూ నమ్మబలికారు. పాపం, ఆ మాయగాళ్ల మాటలకు అడియాస పడ్డ ఆ వ్యక్తి, తన అదృష్టం పండిందనుకుని వారి ట్రాప్‌లో పడిపోయాడు.
మాయగాళ్లు ఒక్కసారిగా లక్షలు అడిగితే ఎక్కడ అనుమానం వస్తుందో అని చాలా తెలివిగా ప్లాన్ చేశారు. "పూజకు సామాగ్రి కావాలి.. కాశీ నుంచి విభూతి రావాలి.. హిమాలయాల నుంచి మూలికలు రావాలి" అంటూ కారణాలు చెప్తూ విడతల వారీగా బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఆ వ్యక్తి నుంచి గుంజేసారు.ఆ ఇంట్లో అర్ధరాత్రి పూజలు, మంత్ర తంత్రాలు, ఎర్రటి గుడ్డలు, నిమ్మకాయలతో ఒక పెద్ద సీన్‌ని క్రియేట్ చేశారు. పూజలు జరుగుతుంటే నిధి బయటపడుతుందని ఆశగా ఎదురుచూసిన బాధితుడికి చివరికి మిగిలింది శూన్యం. రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా బంగారం కాదు కదా, కనీసం చిల్లిగవ్వ కూడా బయటపడలేదు. అప్పుడు కానీ ఆ వ్యక్తికి అర్థం కాలేదు.. తాను పెద్ద మోసగాళ్ల చేతిలో చిక్కుకున్నానని!
మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు రామాయంపేట పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన మోసాన్ని వివరించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితుల కదలికలను గమనించి, పక్కా సమాచారంతో రాజారాం, రాకేష్, అశోక్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోచుకున్న 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ రిమాండ్‌లో ఊచలు లెక్కపెడుతున్నారు.మెదక్ పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 21వ శతాబ్దంలో ఉండి కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం వల్లనే మోసగాళ్లకు అవకాశం దక్కుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా గుప్త నిధులు ఉన్నాయని ఎవరైనా చెబితే అది పక్కా మోసమని గ్రహించాలని సూచించారు.
ప్రాచీన కాలంలో ఎవరైనా దాచిపెట్టినా, అవి మాయ మంత్రాలతో బయటకు రావు. అలా వస్తాయని చెప్పేవాడు వంద శాతం మోసగాడే.మీ అదృష్టం మార్చేస్తామని, పూజలు చేస్తే ధనవంతులు అవుతారని చెప్పే మాయగాళ్లకు దూరంగా ఉండండి.ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. సాధ్యమైతే కుటుంబ సభ్యులతో చర్చించాలి.మెదక్ జిల్లాలో జరిగిన ఈ ‘గుప్త నిధుల స్కామ్’ ఇప్పుడు ఇతర జిల్లాల వారికి కూడా ఒక హెచ్చరిక. కష్టపడకుండా కోట్లు వస్తాయన్న ఆశ ఉన్నంత కాలం.. ఇలాంటి ‘కదకంచి రాజారాం’ లాంటి మోసగాళ్లు పుడుతూనే ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి నేరగాళ్లను పోలీసులకు పట్టించాలని జిల్లా ఎస్పీ కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి