పొలం విషయంలో ఎస్సై తమను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కడప జిల్లా వేముల వండలం వి.కొత్తపల్లి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన బాధిత మహిళ కుటుంబానికి చెందిన పొలం విషయంలో ఎస్సై తలదూర్చడం, సెటిల్మెంట్ కి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఎస్సై అంతలా వేధించాడా..? ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోడానికి కారణం అతడేనా..?

కొత్తపల్లి గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త లక్ష్మీరెడ్డికి 3 ఎకరాల పొలం ఉంది. బాధిత మహిళ పెద్దమ్మకి చెందిన ఆ భూమిని పెళ్లి సందర్భంగా కట్నం రూపంలో ఇచ్చింది. అందులో ఒకటిన్నర ఎకరా పట్టా భూమి కాగా, మరో ఒకటిన్నర ఎకరా డీకేటీ భూమి. ఆ డీకేటీ భూమి విషయంలో బాధిత మహిళ పెద్దమ్మ కుమారుడు గొడవ చేశాడు. ఆ భూమి తనకివ్వాలన్నాడు. దానికి  లక్ష్మీరెడ్డి ఒప్పుకోలేదు. అయితే ఈ విషయంలో పెండ్లిమర్రి ఎస్సై జోక్యం చేసుకోవడంతో గొడవ మొదలైంది.

అయితే తనకే తన బావమరిది 5 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడని, కానీ ఎస్సై సహకారంతో తానే 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్టు ఫోర్జరీ సంతకాలు చేయించుకున్నారని, తనపై కేసు వేశారని అంటున్నాడు లక్ష్మీరెడ్డి. ఎస్సై వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్యా యత్నం చేసిందని చెబుతున్నాడాయన. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చడం సరికాదు. కానీ ఇక్కడ సివిల్ వివాదంతో పోలీసులు కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నారు. పొలం వివాదాన్ని రెవెన్యూ విభాగానికి, కోర్టులకు వదిలేయాలి కానీ స్టేషన్ కు తెప్పించుకుని పరిష్కరించాలనుకున్నారు. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. బాధిత మహిళ ఆత్మహత్యాయత్నంతో ఇప్పుడీ కేసు సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: