
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు రోజు పెరిగిపోతున్నప్పటికీ కూడా ఎక్కడా వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదే నిర్లక్ష్య వైఖరి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి నిర్లక్ష్యమే ఇక్కడ ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి సరైన దారిలో వెళ్లడం మానేసి రాంగ్ రూట్లో వెళ్లాలని ఆలోచన చివరికి ఒకరి ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
తెల్లవారుజామున నింబోలి అడ్డా ప్రాంతానికి చెందిన దుస్తుల వ్యాపారి గోవిందు కర్వ తన ద్విచక్ర వాహనంపై సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వైపు వెళ్లడానికి ట్యాంక్ బండ్ పైకి వచ్చాడు. అయితే చిల్డ్రన్స్ పార్క్ వద్ద రాంగ్ రూట్ నుంచి దూసుకు వచ్చిన ఐ10 కారు ఇక గోవింద్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టి కొంత దూరం వరకు లాక్కెలింది. అయితే అదే సమయంలో అటువైపు నుంచి వచ్చిన మరో కారు గోవిందును ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు. రాంగ్ రూట్లో వచ్చిన కారులో నలుగురు గాయపడ్డట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.