ఇండియాలో ఆరోగ్య పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు కరోనా మహమ్మారి గుర్తు చేస్తోంది. ఇందుకు ఒక విధంగా కరోనాను అభినందించాలేమో.. మన దేశ ఆరోగ్య వ్యవస్థలు ఎంత బలహీనమో కరోనా మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. కరోనా తీవ్రమైతే ఇప్పుడున్న వాటికన్నా 80 రెట్లు అధికంగా వెంటిలేటర్లను సమకూర్చుకోవాలి మనం. ఆరోగ్యమే మహా భాగ్యమని చెప్పుకుంటాం కానీ..అందుకు కావల్సిన వ్యవస్థలపై ఇండియాలో మొదటి నుంచి అంతులేని నిర్లక్ష్యమే.

 

 

కొన్ని గణాంకాలు చూస్తే ఆరోగ్యం విషయంలో మనం ఇంతగా వెనుకబడి ఉన్నామా అనిపించక మానదు. ఇండియన్లు ఏటా చేస్తున్న ఆరోగ్య వ్యయంలో రోగ నిరోధక చికిత్సకోసం 9.6 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో 90.4శాతం.. అంటే అక్షరాలా 3.6 లక్షల కోట్లు రూపాయలు రోగ చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం దేశంలోని దిగువ మధ్య తరగతి కుటుంబాలు పెట్టే ఖర్చులో దాదాపు 70శాతం మందులకోసమే వ్యయమవుతోంది. అంటే మన రోగ నిరోధక చికిత్సల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో చూడండి.

 

 

మరో కఠోరమైన వాస్తవం ఏంటంటే.. ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్లో కేవలం 30శాతం మాత్రమే ప్రాథమిక చికిత్సకోసం వినియోగిస్తున్నారు. 135 కోట్ల జనాభాలో 27శాతానికే ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్‌లో 46.9 కోట్ల మందికి అత్యవసర మందులు అందుబాటులో లేనే లేవు. మరో భయంకరమైన వాస్తవం.. ఇండియాలో ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల చేతుల్లో పెట్టేస్తున్నాయి.

 

 

ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా ఆ ప్రైవేటు ఆసుపత్రులకే కోట్లకు కోట్ల ప్రజాధనాన్ని కట్టబెడుతున్నాయి తప్పితే.. ప్రభుత్వవైద్యశాలలను అభివృద్ధి చేయడం లేదు. ఇకనైనా కరోనా మహమ్మారి పుణ్యమా అని అయినా సర్కారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. ప్రజారోగ్యాన్ని పరిపుష్టం చేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: