రాష్ట్రంలో క‌రోనాపై ముందుండి పోరాడుతున్నారంటూ.. వైద్యులు, పోలీసుల‌కు ద‌క్కుతున్న మ‌ర్యాద‌లు, క‌వ‌రేజ్‌లు.. ఒక‌వైపు క‌రోనా బాధితుల‌ను, వారి స‌మ‌స్య‌ల‌ను, మ‌రోవైపు ఫ్రంట్ వారియ‌ర్ల‌ను క‌వ‌ర్ చేస్తూ.. ప్ర‌జ‌ల చెంత‌కు చేరుస్తున్న‌ది పాత్రికేయులే. ఈ యుద్ధంలో ఇప్ప‌టి వ‌రకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ న‌లుగురు పాత్రికేయులు మృతి చెందారు. అయినా.. కూడా పాత్రికేయు ల త్యాగాల‌ను త‌లుచుకునేవారు, వారిని స్మ‌రించుకునేవారు లేక‌పోగా.. అన్ని వైపుల నుంచి వారిపై మాన‌సిక దాడులు పెరుగు తూనే ఉన్నాయి. యాజ‌మాన్యాల నుంచి కోత‌లు, వాత‌లు, బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తో పాత్రికేయులు ఇప్ప‌టికే న‌లిగిపోయా రు.

 

పోనీ.. ప్ర‌భుత్వాల నుంచి ఏమైనా పాత్రికేయుల‌కు ఆశించిన మేర‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తోంది. ఇటు ఏపీ ప్ర‌భుత్వ‌కానీ, అటు తెలంగాణ స‌ర్కారు కానీ.. పాత్రికేయుల‌కు ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదో.. ఎవ‌రో స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఇచ్చిన మాస్కులే, శానిటైజ‌ర్లే పాత్రికేయుల‌కు కూడా గ‌త‌య్యాయి. పోనీ.. పాత్రికేయ సంస్థ‌లైనా ఏర్పాట్లు చేశాయా ? అంటే.. అది కూడా లేదు. పైగా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన పాత్రికేయుడికి పెయిడ్ లీవ్ అయినా ఇస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. లాస్ ఆఫ్ పేలో వెళ్ల‌మ‌ని నిర్మొహ‌మాటంగా చెబుతున్నారు. ఇలా పాత్రికేయుడు అన్ని విధాలా న‌లిగిపోతున్నారు.

 

ఇక‌, అటు తెలంగాణ ప్ర‌భుత్వం పాత్రికేయుల‌కు రూ.20 వేల రూపాయ‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే, అది ఇంత వ‌ర‌కు కూడా అమ‌లుకు నోచుకోలేదు. అదేస‌మ‌యంలో అక్రిడేష‌న్ల పొడిగింపు విష‌యంలోనూ దాట‌వేత ధోర‌ణినే అవ‌లంబిస్తోంది. అంతేకాదు, పాత్రికేయుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాన‌న్న సీఎం కేసీఆర్‌.. ఆ ప్ర‌తిపాద‌న‌ను అట‌కెక్కించారు. ఏపీలోనూ ఇంతే ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీలో ఫీల్డ్ జ‌ర్న‌లిస్టుల‌కు క‌నీసం క‌రోనా నుంచి భ‌ద్ర‌త క‌ల్పించేలా వారికి కొంత ఎమౌంట్ అయినా ఇవ్వాల‌న్న సూచ‌న‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. 

 

ఇక‌, అక్రిడేష‌న్ల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ఏడాది కాలంగా పొడిగిస్తూనే ఉంది. ఇక‌, ఇల్లులేని జ‌ర్న‌లిస్టులకు స్త‌లాలు ఇస్తామ‌ని జ‌గ‌న్ ఎప్పుడో సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత త‌న మంత్రుల‌తో చెప్పించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దానికి పాత్రికేయులు నోచుకోలేదు. ఇక‌, ఇప్పుడు అక్రిడేష‌న్ల‌లోనూ కోత పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్‌త‌ర్వాత సంస్థ‌ల‌లో ప‌నిచేస్తున్న‌వారికి మాత్ర‌మే అక్రిడేష‌న్ల‌ను పొడిగిస్తామ‌ని, లాక్‌డౌన్ నేప‌థ్యంలో సంస్థ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం చేసిన వారికి ఇచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. 

 

ఇక‌, రాజ‌ధాని జిల్లాలైన గుంటూరు, కృష్నాజిల్లాల్లో ఒక‌ప్పుడు స్టేట్ జ‌ర్న‌లిస్ట్ అక్రిడేష‌న్ ఉన్న పాత్రికేయులు ఏసీ బ‌స్సుల్లోనూ ఉచితంగా ప్ర‌యాణించేందుకు అవ‌కాశం ఉంది. కానీ, తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ సౌక‌ర్యాన్ని తొల‌గించేసింది. ఇలా.. పాత్రికేయుల‌ను వాడుకుంటున్నారే త‌ప్ప ఎవ‌రూ కూడా వారికి ఉప‌యోగ‌ప‌డుతున్న దాఖలా క‌నిపించ‌క‌పోవ‌డంతో మా ఉసురు త‌గులుంద‌ని ఆక్రంద‌న వ్యక్తం చేస్తున్నారు ఇరు రాష్ట్రాల జ‌ర్న‌లిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి: