ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు బాగా పేలుతున్నాయి. పవన్ కల్యాణ్‌ కొన్నాళ్ల క్రితం చేసిన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న కామెంట్లు ఈ మాటల యుద్ధానికి కారణం అయ్యాయి.. ఈ మాటలతో చిర్రెత్తుకొచ్చిన సీఎం జగన్.. మరోసారి పవన్ కల్యాణ్‌ పై ఇటీవల ఓ కార్యక్రమంలో విరుచుకుపడ్డారు. ఎప్పటి లాగానే పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడికి దత్త పుత్రుడని కామెంట్ చేశారు. పవన్, చంద్రబాబు, ఎల్లో మీడియా అంతా ఏకమై వచ్చినా తన వెంట్రుక కూడా  పీకలేరని షాకింగ్‌ కామెంట్స్‌ చేసి ఏపీలో రాజకీయ తుపానుకు తెర లేపారు.


అంతే కాదు.. పవన్ కల్యాణ్‌ టీడీపీకి బీ టీమ్ అని కూడా కొన్నాళ్ల నుంచి వైసీపీ నాయకులు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పడు అనంతపురం జిల్లా  పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్ జగన్‌ విమర్శలపై ఘాటుగా స్పందించారు. తనను చంద్రబాబు అంటే సీబీఎన్‌కు దత్త పుత్రుడు అని అంటే.. తాను జగన్‌ను సి.బి.ఐ.కి దత్త పుత్రుడు అని పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే జనసేనను టీడీపీ బి టీం అని విమర్శిస్తే.. తాను కూడా వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటానని పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శించారు.


వైసీపీ నేతలేమీ దేశం కోసం జైలుకు వెళ్లలేదని.. వారు ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్.. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన మీరా నీతులు చెప్పేది అని ఎద్దేవా చేశారు. తాను కౌలు  రైతుల  పరామర్శకు వస్తున్నాను అని తెలియగానే బాధిత రైతులకు పరిహారం ఇస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.


వైసీపీ అగ్ర నాయకత్వానికీ, తనను తిట్టే వ్యక్తులకు ఒకటే చెబుతున్నానని.. తానేమీ ఏమీ విదేశాల్లో చదువుకోలేదని.. లండన్ రాయల్ ఫ్యామిలీ కాదని.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని కాబట్టి.. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష తనకు వచ్చని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. కేవలం పక్కదారి
పట్టించడం ఇష్టం లేకనే అవన్నీ మాట్లాడటం లేదని పవన్ అంటున్నారు. మరి పవన్ ఎన్‌ కౌంటర్‌పై మళ్లీ వైసీపీ స్పందిస్తుందా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: