రాజకీయాలు అంటే హుందాతనంగా ఉండాలి. చంద్రబాబు, జగన్ ఉదంతాలు మనకి ఏం నేర్పిస్తున్నాయ్ అంటే రాజకీయాలు కొంత వరకే చేయాలి. సైద్ధాంతిక పోరాటాలు చేయాలి. కానీ ప్రతీకార రాజకీయాలు చేయకూడదు. వ్యక్తిగతాలకు పోతే ప్రమాదం. ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరగుతుంది అదే. ప్రతిపక్ష నేతలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు.


జగన్ ను దెబ్బకొట్టడానికి స్కెచ్ వేసింది చంద్రబాబు కాదు సోనియాగాంధీ.  గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకరినొకరు విభేదించుకున్నారు కానీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదు. పైగా ఒకరి మనుషులను మరొకరు కాపాడుకుంటూ వచ్చారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల హయాంలోను ఈ తరహా రాజకీయాలు లేవు.


గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినా వాటిని పార్టీ అగ్రనాయకులు తమ పై వేసుకోలేదు. వాటిని ఖండించి కిందిస్థాయిలోనే పరిష్కరించేవారు.  చీమ చీమా నువ్వెందుకు కుట్టావ్ అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట.. అలా ఉన్నాయి ప్రస్తుత రాజకీయాలు.  ప్రస్తుతం జగన్ సమయం. అధికారంలో ఉన్నాడు. చంద్రబాబును జైలులో పెట్టించారు.  భవిష్యత్తులో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. చంద్రబాబు సమయం రాగానే జగన్ ను జైలుకు పంపిస్తాడు. ఇది కచ్చితంగా జరిగే అంశం అని ప్రజలకు కూడా తెలుసు.


కాబట్టి వ్యక్తిగత రాజకీయాలు వదిలేయకపోతే భవిష్యత్తు పరిణామాలు ప్రమాదకర స్థాయికి వెళ్తాయి. తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి వాటికి పార్టీ అధినాయకత్వం అడ్డు తగలకపోతే రేపు వీరి పరిస్థితి కూడా ఇంతే అనే విషయం గుర్తుంచుకొని రాజకీయాలు చేయాలి. ఇవి కాదు. నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి. మేము వస్తే ఈ పనులు చేస్తాం.. గత ప్రభుత్వ పథకాలు లోని లోపాలను ఎత్తి చూపి వాటిని అధిగమిస్తాం అని చెప్పే విధంగా ఉండాలి. అంతేగానీ వ్యక్తిగత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: