వైద్యుడైన డోలాకు ఆరోగ్యశాఖ కరెక్ట్‌..
డాక్టరే మంత్రి అయితే అదిరిపోయేది కాదా?
సాంఘిక సంక్షేమంపై డోలా ముద్ర వేస్తారా?

చంద్రబాబు కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. ఆయన తన మంత్రులకు శాఖలను కాస్త ఆలస్యంగా ప్రకటించారు. ఆలస్యం చేశారంటే శాఖల కేటాయింపుపై పెద్ద కసరత్తే చేసి ఉంటారని అంతా భావించారు. అయితే.. ఆ శాఖల కేటాయింపు చూశాక అంత సంతృప్తికరంగా అనిపించలేదు. ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరికి ఒక్కో నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యానికి అనుకూలంగా శాఖలు ప్రకటిస్తే ఆ రంగాల్లో ఉన్న అనుభవంతో వారు చక్కగా సేవలు అందించే అవకాశం ఉంటుంది.


కానీ చంద్రబాబు తన మంత్రులకు శాఖల కేటాయింపులో ఆ నేపథ్యాన్ని పెద్దగా పరిశీలనకు తీసుకున్నట్టు కనిపించలేదు. ఇందుకు ఉదాహరణ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన డోలా బాల వీరాంజనేయలుకు ఇచ్చిన శాఖను చూస్తే అర్థమవుతోంది. డోలా బాల వీరాంజనేయలు దాదాపు 30 ఏళ్లపాటు వైద్యుడిగా పని చేశారు. ఆయనకు వైద్య రంగంపై పూర్తి అవగాహన ఉంది. ఆ నేపథ్యాన్ని ఉపయోగించుకుని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చి ఉంటే ఆయన ఆ శాఖల్లో చక్కటి సేవలు అందించే అవకాశం ఉండేది.


కానీ ప్రస్తుతం చంద్రబాబు డోలా బాల వీరాంజనేయలుకు సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, వృద్ధుల సంక్షేమ శాఖలతో పాటు సచివాలయం, వాలంటీర్ల శాఖలు అప్పగించారు. అయితే ఇక్కడ మరో కోణం ఉంది. డోలా బాల వీరాంజనేయలు ఎస్సీ కాబట్టి ఆ నేపథ్యం దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు సాంఘింక సంక్షేమ శాఖ అప్పగించి ఉండొచ్చు. కానీ.. అంతకంటే ఆయన వైద్య నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే బావుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


ప్రభుత్వానికి పేరు తెచ్చే శాఖల్లో వైద్యారోగ్య శాఖ ఒకటి. ఈ రంగంలో తెచ్చే సంస్కరణలు ప్రజలకు అనుకూలంగా ఉంటే.. పాలకులకు మంచి పేరు వస్తుంది. గతంలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ వంటి పథకాల ద్వారానే చిరస్థాయిలో కీర్తి సంపాదించిన సంగతి మనకు తెలిసిందే. అందుకే ఆ రంగంలో అనుభవం ఉన్నవారికి వైద్యారోగ్య శాఖ అప్పగించి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. డోలా బాల వీరాంజనేయలు సాంఘిక సంక్షేమం సహా సచివాలయం, వాలంటీర్ల శాఖలను సమర్థంగా నిర్వహించాలని ఇండియా హెరాల్డ్ అభిలషిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: