151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. అప్పట్లో ఆదిలోనే తీవ్రమైన తప్పులు చేసింది. పాలన ప్రారంభించడమే కూల్చివేతలతో ప్రారంభించింది. జగన్ తన మొదటి మీటింగ్‌ ప్రజావేదికలో నిర్వహించి.. ఆ మీటింగ్ అయిపోగానే దాన్ని కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. అలా కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన.. అనేక తప్పిదాలతో కొనసాగింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు అందించినా జనం మాత్రం జగన్‌ను ఇంటికి పంపేశారు.


అయితే.. అప్పటి కూల్చివేతలే తమ కొంప ముంచాయని ఇప్పుడు వైసీపీ నేతలు గ్రహిస్తున్నారు. అధికారంలో ఉండగా తమ ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే నేడు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నిన్న కామెంట్ చేశారు. అలా చేయకపోయి ఉంటే.. ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండే వాళ్లం అని ఆ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరులతో అన్నారు.


విశాఖలోని ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  మీడియాతో మాట్లాడారు. అక్కడి వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవని అధికారులు నోటీసులు అంటించారు. అనుమతుల అంశంపై కార్యాలయం గోడకు జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చదివారు. ఆ తరువాత ఆ నోటీసులను ఆయన తొలగించారు.


మొత్తానికి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కు తమ కూల్చివేతల పాలనే తమ కొంప ముంచిందని అర్థం చేసుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం ఇంకా.. తాము ఎంతో మంచి చేసినా ప్రజలు తమను ఓడించారన్నట్టుగా మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఎంతో మంచి చేసింది నిజమే. కానీ.. తాము చేసిన మంచి గురించే తప్ప.. తాము చేసిన తప్పుల గురించి మాత్రం జగన్ ఇంకా ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు. కానీ తప్పులు కూడా తెలుసుకున్నప్పుడే వాటిని దిద్దుకునే అవకాశం వస్తుందని జగన్ గ్రహించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: