
దీనికి విరుద్ధంగా, టీడీపీ సలహాదారుల వ్యవస్థను గోప్యంగా కానీ సమర్థంగా కొనసాగిస్తోంది. టీడీపీలో సలహాదారులు బహిరంగ వేదికలపై ఎక్కువగా కనిపించకపోయినా, పార్టీ వ్యవహారాలపై కీలక సూచనలు చేస్తుంటారు. పార్టీకి అనుకూలమైన విధానం, నాయకుల ప్రవర్తన, వ్యూహాలు, సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో తగిన సూచనలు ఇస్తూ పార్టీని ప్రణాళికతో ముందుకు నడిపిస్తున్నారు. దీని వల్ల టీడీపీ అంతర్గతంగా ఈ సలహాలతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది.
అదే సమయంలో వైసీపీలో సలహాదారుల లోపం కారణంగా కార్యక్రమాల నిర్వహణలో, నాయకులను సమన్వయం చేయడంలో, క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిలబెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సలహాదారులు ఉంటే ప్రజల అభిప్రాయాలను, పరిస్థితులను దగ్గరగా తెలుసుకొని, వాటికి తగ్గట్టుగా చర్యలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజల నాడిని అంచనా వేసి, ఆ దిశగా వ్యూహాలు రూపొందించడం కూడా సులభమవుతుంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సలహాదారుల వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే నలుగురు కొత్త సలహాదారులను నియమించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. వీరి ఎంపికలో మూడు ప్రధాన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని సమాచారం. ఈ కొత్త సలహాదారులుగా రాజకీయ అనుభవంతో పాటు విశ్లేషణాత్మక దృష్టి కలిగిన ఐఐటీయన్లు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను ప్రాధాన్యంగా తీసుకునే ఆలోచన ఉంది. సాంకేతిక విశ్లేషణ, డేటా ఆధారిత వ్యూహాలు, సోషల్ మీడియా ప్రభావాన్ని సమర్థంగా వినియోగించడం వంటి అంశాల్లో వీరి సహాయం పొందాలనేది జగన్ ఆలోచన. మరి ఈ కొత్త ఈ సలహాదారులు పార్టీ వ్యూహాలను ఎంతవరకు ప్రభావితం చేస్తారో, ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించడంలో ఎంతమేర సఫలీకృతం అవుతారో చూడాలి.