
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారు ? అన్నదానిపై పెద్దగా చర్చ అవసరం లేదు. సహజంగానే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోను బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారు. అక్కడ తెలుగుదేశం కేడర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బిజెపికి సపోర్ట్ చేస్తారు అనటంలో ఎవరికి ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు. ఇక్కడ పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో జూబ్లీహిల్స్ లో తెలుగుదేశం విజయం సాధించింది.
ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంకు తో పాటు అభిమానులు, నాయకులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వారు బిజెపికి మద్దతు ఇస్తారా ? లేదా సామాజిక సమీకరణలు .. గతంలో గోపీనాథ్ తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న గోపీనాథ్ సతీమణి సునీతకు సపోర్ట్ చేస్తారా ? అన్నదానిపై పార్టీ అభిమానులలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు అయితే బిజెపి అభ్యర్థికి సపోర్ట్ చేయాలి. లేని పక్షంలో కొందరు పార్టీ అభిమానులు బిఆర్ఎస్ కు సపోర్ట్ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో టిడిపి పై చంద్రబాబు ఇంకా దృష్టి సారించలేదు. గత ఎన్నికలకు ముందు వరకు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత కనీసం అధ్యక్షుడిని కూడా నియమించలేదు. కానీ టిడిపి నేతలు మాత్రం ఆ పార్టీని వదలకుండా మీడియాలో.. అక్కడక్కడ క్షేత్రస్థాయిలో పని చేసుకుంటున్నారు.