శబరిగిరుల్లో కొలువైన శ్రీ అయ్యప్ప ఆరోగ్య ప్రదాత కూడా. అయ్యప్ప సేవనం సకల సమస్యల పరిష్కారం. చింతల్ని పారద్రోలే సాధనం. ఈ విశ్వాసాలతో పాటు శ్రీ అయ్యప్ప స్వామి చరణారవింద సేవ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించొచ్చు.41రోజుల అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్షగా పేర్కొనవచ్చు. చన్నీటి స్నానం, నేలపై పడుకోవడం ఏకభుక్తం, పాదరక్షలు లేకుండా నడవడంలాంటి నియమాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.


దీక్షా కాలంలో నేలపై పవళించడం ద్వారా వెన్నునొప్పి పోయి కండరాలు పటిష్టమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. తెల్లవారుజామునే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీక. ఆ వెన్వెంటనే చన్నీటి స్నానం శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఏకభుక్తం అంటే ఒక్కపూట భోజనం చేయడం ద్వారా మితాహారానికి అయ్యప్ప భక్తులు అలవాటు పడతారు. అందులోనూ శాకాహారమే తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.


దీక్షా సమయంలో పొగతాగడం, మద్యపానియంలాంటి వ్యసనాలకు దూరంగా ఉండడంతో శారీరక ఆరోగ్యం సమకూరుతుంది. అంతేనా! మానసిక ప్రశాంతత కూడ లభిస్తుంది. తద్వారా ముఖంలో కొత్త కళ తాండవిస్తుంది. అయ్యప్ప అర్చన సమయంలో మనసు ఆ దేవదేవుడి పై లగ్నమవడంతో ప్రశాంతత లభిస్తుంది. సామూహిక భజనలు తప్పనిసరి కావడంతో జనంతో మమేకమవడం, జనం సమస్యల్ని తెలుసుకోవడం, ఆ సమస్యలకి ఇతోధికంగా సహకారం అందించడంలాంటి కార్యక్రమాలు సమాజహితానికి దోహదపడతాయి.


క్రమశిక్షణ అలవడడమే కాకుండా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరుగుతుంది. సంఘజీవనాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు తాము ధరంచిన దుస్తుల్ని తామే క్రమం తప్పకుండ తడిపి, ఉతికి ఆరేసుకోవడం ద్వారా శ్రమైక జీవన సౌందర్యం భాసిల్లుతుంది. ఒకరిపై ఆధారపడే గుణం వైదొలుగుతుంది. అయ్యప్ప శరణ ఘోష తప్ప మరొకరకమైన చవకబారు అధిక ప్రసంగాల జోలికి వెళ్ళకపోవడంతో ఏరకమైన వివాదాలు దరి చేరవు.


మరింత సమాచారం తెలుసుకోండి: