క‌రోనా వైర‌స్ పేరు వింటేనే తెలంగాణ రాష్ట్రంలో ఖాకీలు వ‌ణికి పోతున్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా వ‌రుసగా పోలీస్ అధికారులు, సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో విధులు నిర్వ‌హిస్తున్న అధికారులు, సిబ్బంది హ‌డ‌లెత్తిపోతున్నారు. క్షేత్ర‌స్థాయిలో నిత్యం విధుల్లో మునిగి ఉండి జ‌న‌స‌మ్మ‌ర్దంలో మెదులుతూ ప‌నిచేస్తుండ‌టంతో క‌రోనాకు చాలా దగ్గ‌ర‌గా జీవిస్తున్నామ‌ని పోలీసులు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇక రోజుకో పోలీస్ స్టేష‌న్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో సంబంధిత సిబ్బంది, ఉద్యోగితో స‌న్నిహితంగా మెదిలిని వారంద‌రిని క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 


రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. ఇవాళ ఆ సంఖ్య 15 మందికి చేరింది.ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధి లోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు వణికి పోతున్నారు. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో వరుసగా కరోనా కేసులు బయట పడుతున్నాయి.  కనిపించని శత్రువు కరోనా తో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులను కరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయం.. దీంతో అప్రమత్తమైన పోలీసు  ఉన్నతాధికారులు  తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రాణాల‌తో చెలాగాటం ఆడుతూ మ‌రి విధులు నిర్వ‌హించాల్సి రావ‌డం దారుణ‌మ‌ని పేర్కొంటున్నారు.

 


ఇదిలా ఉండ‌గా గాంధీలో కూడా క‌రోనా బారిన ప‌డుతున్న వైద్యులు, సిబ్బంది సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలోనే వారు కొంత‌మంది విధుల‌కు దూరంగా ఉంటామ‌నే డిమాండ్‌ను లేవ‌నెత్తగా ప్ర‌భుత్వం చొర‌వ‌తో వివాదం స‌ద్దుమ‌ణిగింది. తాజాగా  తెలంగాణలో శుక్ర‌వారం కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 133 కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4484కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇదిలా ఉండ‌గా మ‌రో రెండు రోజుల్లో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్న వార్త‌ల‌తో జ‌నాలు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళ‌‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: