ప్ర‌పంచ దేశాల మాన‌వాళి ప్రాణాల‌ను హ‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి విల‌యాన్ని సృష్టిస్తోంది. రోజుకు సుమారు ల‌క్ష కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులోనూ ప్ర‌ధానంగా భార‌త్‌, అమెరికా, బ్రెజిల్‌, ఐరోపా దేశాలే ముందు వ‌రుస‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. కొత్త కేసుల న‌మోద జాబితాలో భార‌త్‌కు మూడో స్థానంకు చేరుకుంది. చైనాను వదిలేసిన కరోనా మహమ్మారి సుమారు 213 దేశాలకు విస్తరించింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి ప‌దిల‌క్ష‌ల మందికి ఈ వైర‌స్ వ్యాప్తి చెందింది.  ఇందులో 5,18,968 మంది మరణించారు. కరోనా బారినపడినవారిలో 43,45,614 మంది చికిత్స పొందుతుండగా, మరో 64,57,985 మంది కోలుకున్నారు. 


మొత్తం నమోదైన కేసుల్లో కోలుకున్నవారి సంఖ్య 92 శాతం ఉండగా, మరణాల శాతం 8గా ఉన్నది. వాస్త‌వానికి ఇది కొద్దిరోజుల క్రితం వ‌ర‌కు కూడా3 శాతానికి ప‌రిమితం కాగా కొద్ది రోజులుగా మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌డంతో 8శాతానికి చేరుకుంది. పాజిటివ్ కేసుల న‌మోదులో అగ్రరాజ్యం అమెరికా ప్ర‌థ‌మ‌స్థానంలో కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 52వేల పాజిటివ్‌ కేసులు నమోదవగా, శుక్రవారం కొత్తగా 55,220 మందికి కరోనా పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకు అమెరికాలో ఒకే రోజు ఇంత పెద్దమొత్తం కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో అమెరికా అధికారులతో పాటు జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 6,05,220కు చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 17,848 మంది బాధితులు మృతిచెందారు. మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 2,27,476 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,59,896 మంది బాధితులు కోలుకున్నారు. యూకేలో కరోనా కేసుల సంఖ్య 3,13,483కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 43,906 మంది మృతిచెందారు. కరోనా కేసుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో ఇప్పటివరకు 2,96,739 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,363 మంది మృతిచెందారు. పెరులో కరోనా కేసుల సంఖ్య 2,88,477కు చేరగా, వైరస్‌ బారినపడిన వారిలో 9860 మంది చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: