బాలీవుడ్‌ను అమితాబ్ శ‌కం త‌రువాత.. ఖాన్ త్ర‌యం హ‌వా మొద‌ల‌వ‌డానికి ముందు  దాదాపు ఓ ద‌శాబ్ద‌కాలం పాటు అప్ర‌తిహ‌తంగా ఏలేసిన స్టార్ హీరో అనిల్ క‌పూర్ తొలిసారి హీరో అయింది తెలుగు చిత్రంలోనే అంటే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది క‌దూ..?  కానీ అది నిజం. 1979లో హ‌మారే తుమ్హారే అనే  బాలీవుడ్ సినిమాతో తొలిసారిగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైనా అందులో అనిల్ క‌పూర్ హీరో కాదు. 1980లో మ‌న గ్రేట్ డైరెక్ట‌ర్ బాపు ద‌ర్శ‌క‌త్వంలో వంశ‌వృక్షం చిత్రంలో మొద‌టిసారిగా హీరోగా అనిల్ క‌పూర్ న‌టించాడు. జ్యోతి అత‌డి స‌ర‌స‌న క‌థానాయిక‌. ఆవిధంగా హీరోగా అనిల్ డెబ్యూ మూవీ తెలుగులోనే అన్న‌మాట‌. ఆత‌రువాత‌ 1983లో ఓ సాత్‌దిన్ చిత్రంతో బాలీవుడ్‌లో క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు.  1986లో క‌ర్మ సినిమాతో సూప‌ర్ హిట్ ను త‌న‌ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత 87లో మిస్ట‌ర్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో శ్రీదేవి అత‌డి స‌ర‌స‌న క‌థానాయిక, 88లో వ‌చ్చిన తేజాబ్ చిత్రంతో మ‌రో సూప‌ర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో అత‌డి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించిన మాధురీదీక్షిత్ కూడా స్టార్‌డ‌మ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని ఏక్ దో తీన్ పాట బాలీవుడ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్‌లో స్థానం సంపాదించుకుంది.
 
            ఇక 1989లో రామ్‌ల‌ఖన్‌, 92లో బేటా వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో  అనిల్ క‌పూర్ హ‌వా బాలీవుడ్ లో తిరుగులేకుండా న‌డిచింది. ఆ స‌మ‌యంలో అంతా అనిల్‌క‌పూర్ మ‌యం అయిపోయింద‌ని త‌న‌తో స‌హా మిగిలిన హీరోలెవ‌రూ అత‌డిముందు క‌నిపించ‌డం లేద‌ని అమితాబ్ సైతం వ్యాఖ్యానించారంటే అనిల్ స్టార్డ‌మ్ ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ఎదుర‌వ‌డం,  ఖాన్ త్ర‌యం హ‌వా మొద‌ల‌వ‌డంతో అనిల్ ప్రాభ‌వం త‌గ్గుముఖం ప‌ట్టింది. 99లో వ‌చ్చిన హ‌మ్ అప్‌కే దిల్‌మే రెహ‌తాహై, బీవీ నెంబ‌ర్ వ‌న్ సినిమాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2009లో నో ఎంట్రీ చిత్రంలో న‌టించాడు. బాలీవుడ్ హీరోయిన్‌గా ఉన్న సోన‌మ్ క‌పూర్ అనిల్ కూతురేన‌న్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: