
అందుకే డెబ్యూతోనే మాస్ టచ్ ఉన్న ప్రేమకథ చేయాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదు. రెండో ప్రయత్నం రాఘవేంద్ర దారుణంగా దెబ్బ తిన్నా వర్షంతో బాక్సాఫీస్ కు కొత్త స్టార్ వచ్చాడనే సంకేతం 2004లో ఇచ్చాడు. అడవిరాముడు, చక్రంలు నిరాశపరిచినా రాజమౌళి చేతిలో పడ్డాక ఛత్రపతి ద్వారా ప్రభాస్ లో రియల్ మాస్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. తిరిగి పౌర్ణమి, యోగి, మున్నాలు ఫ్లాప్ బాట పడితే బుజ్జిగాడు, బిల్లాతో మళ్ళీ ఎనర్జీని తెచ్చుకున్నాడు. ఏక్ నిరంజన్ గాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గర చేశాయి. రెబల్ డిజాస్టరైనా అందులో స్టయిలింగ్ కి ఫాన్స్ ఉన్నారు.కొత్త దర్శకుడిని నమ్మి చేసిన మిర్చి గురించి చెప్పేదేముంది. కెరీర్ ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు కేవలం జక్కన్న మీద నమ్మకంతో అయిదేళ్ల విలువైన కాలాన్ని బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ కోసం త్యాగం చేయడం ప్రభాస్ ని దేశవిదేశాల్లో ప్రేక్షకులకు తిరుగులేని ఫ్యానిజంని కట్టబెట్టింది. తెలుగు సినిమా వందల నుంచి వేల కోట్లకు ఎగబాకింది. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ లు నిరాశపరచవచ్చు గాక. కానీ ప్రభాస్ కట్టుకున్న సామ్రాజ్యంలో చిన్న ఇటుకను కూడా కదపలేకపోయాయి. అందుకే బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్, భారతదేశపు ఖరీదైన చిత్రం ప్రాజెక్ట్ కె అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. కెజిఎఫ్ దర్శకుడు వెంటపడినా, కంటెంట్ ని నమ్మి మారుతీ లాంటి డైరెక్టర్ కు ఎస్ చెప్పినా అది డార్లింగ్ కే చెల్లు. అందుకే తన పుట్టినరోజు అందరికీ ఇంత స్పెషల్.