
సినిమాలతో కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు, విషయాల్లో జోక్యం చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు నటి కరాటే కళ్యాణి. మొన్నటికి మొన్న తిరుపతికి వెళ్లి.. అక్కడేదో అన్యాయం జరిగిందని మీడియాకెక్కిన ఆమె.. తాజాగా మరో వివాదానికి తెర లేపారు. దానికి కారణమైంది ఎన్టీఆర్ విగ్రహం. ఈ నెల 28న ఉమ్మడి ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు పరిశ్రమ ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్‌పై 54 అడుగుల పొడవైన శ్రీ కృష్ణ అవతారంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్డడంపై కరాటే కళ్యాణి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి తెరలేపారు.
శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఇప్పటికే జూ ఎన్టీఆర్ తో పాటు పలువురికి ఆహ్వానాలు అందాయి. ఈ సమయంలో దేవుని రూపంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై కొన్ని కుల సంఘాలు, హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కూడా నటి కరాటే కళ్యాణి చెబుతుంది. వారితో కలిసి పోరాటం చేస్తోంది. ఈ సమయంలో ఆమెకు మా అసోసియేషన్ నుండి బెదిరింపు కాల్ వచ్చిందని తెలుస్తోంది. స్వయంగా మంచు విష్ణు కాల్ చేసినట్లు సమాచారం. ఆ కాల్‌లో మీ స్టాండ్ మార్చుకోవాలని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందించింది. కాల్ రావడం వాస్తమేనని చెప్పింది. అయితే అది బెదిరింపు కాల్ కాదని పేర్కొంది.
‘నాకు మా అసోసియేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన మాట నిజమే. అయితే అదేం బెదిరింపు కాల్ కాదు. మా అసోసియేషన్ ఈ విషయంపై పిలిపించి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌గారు ఓ దేవుడులాంటి వ్యక్తి. ఆయన విగ్రహావిష్కరణకు అడ్డుపడటం కరెక్ట్ కాదని అన్నారు. మీ స్టాండ్ మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. ఫోన్ చేశాక వెళ్లి మాట్లాడాను. అయితే నేను ఏం చెప్పానంటే నాకూ ఎన్టీఆర్‌గారంటే గౌరవం, భక్తి ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నాకేం సమస్య లేదు. కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటాన్ని తప్పు పడుతున్నానని చెప్పాను. నా స్టాండ్ వారు అర్థం చేసుకున్నప్పటికీ మా రూల్స్ ప్రకారం క్రమశిక్షణా సంఘం చర్యలు ఉంటాయని చెప్పారు. అందులో బాలకృష్ణ, మురళీ మోహన్, జయసుధ, జయప్రద వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. క్రమశిక్షణా కమిటీతో మాట్లాడి యాక్షన్ తీసుకోబోతున్నాం. షోకాజ్ నోటీసులు వస్తాయి. అవి తీసుకున్నాక వివరణ ఇవ్వండి. మేం దాన్నిపరిశీలిస్తాం‘ అని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఆత్మవిమర్శ చేసుకుని, తాను బానిస బతుకు బతకలేనని, తానెవ్వరికీ వ్యక్తి పూజ చేయడం లేదని, భక్తితో చేస్తున్నానని, తన పోరాటం సరైనదేనన్నారు. తన ఇష్ట దైవం, కుల దైవం, కుల సంఘంలో ఉన్న నాయకురాలిగా తాను ఈ ఫైట్ చేస్తున్నానని అన్నారు. అంతేకాకుండా కొన్ని విమర్శలు చేశారు. అలాగే ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఇప్పటికే మా అసోసియేషన్ నుండి షోకాజు నోటీసులు వచ్చినట్లు చెప్పారు.