జేడీ చక్రవర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో విలన్ గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా సుపరిచితుడే. విలన్ గా తెరంగేట్రం చేసి హీరోగా మారాడు. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, క్రేజ్ ని సంపాదించాడు. తర్వాత కారెక్టర్ ఆర్టిస్టుగానూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వమూ వహించాడు. కొన్ని సినిమాలను నిర్మించాడు.

జేడీ చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. 1989లో వచ్చిన శివ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తర్వాత నేటి సిద్ధార్ధ, శ్రీవారి చిందులు, అతిరథుడు, రక్షణ, ఆదర్శం పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశాడు. తర్వాత శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన మనీ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అక్కడి నుంచి వరుసగా హీరోగా పలు చిత్రాల్లో నటించి క్రేజ్ సంపాదించాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా జేడీ చక్రవర్తి కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత జేడీ వెనక్కి తిరిగి చూడలేదు. అనగనగా ఓ రోజు, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయెరా.. వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఇక 1998లో వచ్చిన సత్య సినిమాతో స్టార్ డమ్ వచ్చింది. ఈ సినిమా తెలుగులోనే కాదూ.. హిందీలోనూ జేడీకి గుర్తింపు వచ్చిన చిత్రంగా నిలిచింది.

తెలుగులోనే కాదు తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన జేడీ.. పలు సినిమాలకు దర్శకత్వం  కూడా వహించారు. పాపే నా ప్రాణం సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే జేడీ లక్నోకి చెందిన అనుకృతి గోవింద్ ను 2016లో వివాహమాడాడు. అనుకృతి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా రూపొందించిన శ్రీదేవి సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి జేడీ దర్శకత్వం, సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. అలా జేడీ చక్రవర్తి భార్య కూడా హీరోయినే అన్న విషయం చాలా మందికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: