మా ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికల అంశంపై ఇప్పటికే అనేక మంది నటులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న నటి హేమ ప్రస్తుత ప్రెసిడెంట్ నరేశ్‌ పై ఘాటుగా విమర్శలు చేశారు. నరేశ్ ప్యానల్ కొత్తగా ఫండ్స్ కలెక్ట్ చేయకపోగా.. ఉన్న సొమ్మంతా ఖర్చు చేశారని విమర్శలు చేశారు. దీనిపై నరేశ్ కూడా స్పందించారు.. ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడంతో మరోసారి మా రాజకీయాలు వేడెక్కాయి.


ఇటీవల "మా"పై సీనియర్ నటి హేమ చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆమెపై త్వరలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. "మా" నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే "మా' ఎన్నికలు జరపాలంటూ క్రమశిక్షణ సంఘానికి పంపిన లేఖలపై సంతకాలు చేయాలని మా సభ్యులందరినీ కోరుతూ హేమ ఒక వాయిస్ మెసేజ్ పంపింది. ఈ నేపథ్యంలో "మా" ఎన్నికల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటున్న అనేది ఆసక్తికరంగా మారింది.


సరిగ్గా ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరిపించాలని కోరారు. 'మా' ఎన్నికలు జాప్యం లేకుండా వెంటనే జరగాలన్న చిరంజీవి.. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని గుర్తు చేశారు. ఇలా ఆపద్ధర్మ కార్యవర్గం ఎక్కువ కాలం కొనసాగింపు మంచిది కాదని చిరంజీవి హితవు పలికారు. 'మా' కార్యక్రమాలు వివాదాలకు తావు లేకుండా ఉండాలని.. కానీ.. కొందరు సభ్యులు వివాదాస్పదంగా మీడియాలో వ్యాఖ్యలు చేయడం వల్ల సినీ పరిశ్రమ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడటం వల్ల గందరగోళం ఏర్పడుతోందన్న చిరంజీవి అభిప్రాయభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. బహిరంగంగా విమర్శించుకోవడం ఎవరికీ సరైంది కాదన్న మెగాస్టార్ సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని భావిస్తున్నామని కృష్ణంరాజుకు రాసిన లేఖలో ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: