తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు నటీనటులంతా మద్రాస్ అసోసియేషన్ లో భాగంగా ఉండేవారు. ఆ తర్వాత దక్షిణాది సినీ నటుల అసోసియేషన్ మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావు మొదటగా చెన్నైలో షూటింగులు చేయనని.. తనతో సినిమాలు చేయాలనుకుంటే హైదరాబాద్ రావాలని ప్రకటించేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభమైంది. ఆ తర్వాత మెల్లగా ఎన్టీఆర్, తదితర స్టార్ హీరోలు కూడా హైదరాబాద్ కు రాక తప్పలేదు. అప్పటి మద్రాస్ నగరం నుంచి హైదరాబాద్ కు తరలి వచ్చాక తొలిరోజుల్లో సినీ పరిశ్రమ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్య మంత్రులు కూడా సినీ నటులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారు. సినీ పరిశ్రమ నిలదొక్కుకునేందుకు స్టూడియోల నిర్మాణం కోసం స్థలాలను కూడా కేటాయించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతుగా పూర్తిగా సహకారం అందించారు.

అయితే సినీ పరిశ్రమ మెల్లగా అభివృద్ధి చెందాక పెద్ద సినిమాలు రావడం మొదలయ్యాయి. కొత్త తరం హీరోల రాకతో తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో ఆర్టిస్టులు, నిర్మాతలు, దర్శకులు, రైటర్లు.. ఇలా ఎంతో మంది పనిచేసే ఇండస్ట్రీలో, కొన్ని సమస్యలు, విభేదాలు రావడం మొదలయ్యాయి. వీటన్నిటినీ పరిష్కరించే ఉద్దేశంతో చాలా ఏళ్ల కిందట తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను స్థాపించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడే సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకునేవారు. అలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. మొదటగా చిరంజీవిని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నిక చేసి.. 1993లో అసోసియేషన్ ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు ముఖ్య సలహాదారులుగా.. రెండేళ్లపాటు మురళీమోహన్ నివాసంలోనే కార్యకలాపాలు కూడా నిర్వహించారు. 1993 అక్టోబర్ 4న తొలి కార్యాలయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలలో మురళీమోహన్ ఆరుసార్లు 'మా' అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, నాగబాబు కూడా అధ్యక్షులయ్యారు. మొదట్లో ఏకగ్రీవం అయినా.. 2015 నుంచి అసోసియేషన్ లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అసోసియేషన్ ప్రారంభించిన తొలినాళ్లలో 150మంది సభ్యులుండేవారు. అప్పట్లో పేద కళాకారులకు అసోసియేషన్ ద్వారా ఉచితంగా వైద్యం అందించేవారు. తర్వాత వారి బాగోగుల కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు, బెనిఫిట్ షో లు, ఆటల పోటీలు పెట్టేవారు. వాటి ద్వారా నిధులు సేకరించేవారు. తర్వాత విరాళాలు, సభ్యత్వ రుసుములు పెరిగాయి. ప్రస్తుతం అసోసియేషన్ సభ్యత్వ రుసుము లక్ష రూపాయలకు చేరింది. మొత్తంగా 914మంది శాశ్వత సభ్యులుండగా..  29మంది అసోసియేట్ సభ్యులున్నారు. అయితే వీరిలో ఇప్పుడు 850మంది మాత్రమే అసోసియేషన్ లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారు. దక్షిణాదిలో చిత్ర పరిశ్రమ సంఘాల్లో ఎక్కువమంది సభ్యులున్నది కేవలం 'మా' అసోసియేషన్ లోనే. అయితే వీరిలో ఓటు హక్కు వినియోగించుకునేది మాత్రం చాలా తక్కువ. అందులో సగం కూడా ఉండరు. చిన్న నటులు, పేద కళాకారులు సభ్యత్వ రుసుము చెల్లించలేక 'మా' అసోసియేషన్ కి దూరంగా ఉంటున్నారు.

అయితే కాలక్రమంలో మా అసోసియేషన్ స్థాయి కూడా బాగా పెరిగింది. అగ్ర నటీనటులంతా మా అసోసియేషన్ పైనే కన్నేశారు. ఇండస్ట్రీని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్.. బాలీవుడ్ ను కూడా దాటేసింది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమాలు ఎక్కువవడంతో.. దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలు టాలీవుడ్ వైపే చూస్తున్నాయి. దీంతో ఎలాగైనా సరే, మా అసోసియేషన్ ను గుపిట్లో పెట్టుకోవాలని సినీ పెద్దలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే 'మా' ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిని చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: