కర్నూలు: సుమారు 33 ఏళ్ల క్రితం తాను హీరోగా నటించిన 'శివ' విడుదలైన రోజే ఈ ఏడాది 'ది ఘోస్ట్‌'  చిత్రం విడుదలవుతుండటం విశేషమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
అప్పుడు అక్టోబరు 5న సైకిల్‌ చైన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చానని, ఇప్పుడు కత్తితో రాబోతున్నానని తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్‌.టి.బి.సి కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. తన తనయులు, నటులు నాగచైతన్య , అఖిల్‌ అతిథులుగా హాజరయ్యారు.
చిత్ర పరిశ్రమ, నాన్నకు థ్యాంక్స్‌: నాగార్జున

''మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు సినీ పరిశ్రమ, మా నాన్న (అక్కినేని నాగేశ్వరరావు)గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. సుమారు 33ఏళ్ల క్రితం అక్టోబరు 5న 'శివ' అనే సినిమా వచ్చింది. సైకిల్‌ చైన్‌తో అప్పుడు మీ ముందుకొచ్చా. ఇప్పుడు కత్తితో 'ది ఘోస్ట్‌' చిత్రంతో అదే రోజు వస్తున్నా. రెండూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే. విజయ దశమి అందరికీ విజయం అందిస్తుందంటారు. మా సినిమా విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్‌కు యాక్షన్‌, డ్రామా కథలంటే అంటే బాగా ఇష్టం. ఆ రెండూ కలిపి తీసిన చిత్రమే 'ది ఘోస్ట్‌'. 'శివ' విషయంలో సౌండ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 'ది ఘోస్ట్‌' విషయంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌ ఓ రేంజ్‌లో ఉంటాయి. మీ ప్రేమ, కేరింతలు, ఉత్సాహాన్ని దగ్గర్నుంచి చూస్తారనే చైతూ, అఖిల్‌ని ఇక్కడికి తీసుకొచ్చా. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నా. అదే రోజున విడుదకాబోతున్న నా ఆప్తుడు చిరంజీవి గారి సినిమా (గాడ్‌ ఫాదర్‌) కూడా విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని నాగార్జున అన్నారు.
ఎప్పుడూ 'ది ఘోస్ట్‌' గురించే: నాగచైతన్య

''నాన్నను నేను వారంలో రెండుమూడు రోజులు కలుస్తుంటా. తాను నటించే సినిమాలు, బిగ్‌బాస్‌ కార్యక్రమం గురించి చర్చిస్తుండేవారు. కానీ, కొన్నాళ్ల నుంచి ఆయన ఒకే ఒక టాపిక్‌ గురించి మాట్లాడారు. అదే 'ది ఘోస్ట్‌' సినిమా. ఆయన్ను అంత ఉత్సాహంగా చూసి చాలా కాలమైంది. 'బంగార్రాజు' నుంచి 'ది ఘోస్ట్‌' పాత్రకు తగ్గట్టు మారటం అంత తేలిక కాదు. ఆ విషయంలో నాన్న మాకెంతో స్ఫూర్తి. నేను చూడాలనుకున్న విధంగా నాన్నను 'ది ఘోస్ట్‌'లో స్టైలిష్‌గా చూపించినందుకు దర్శకుడు ప్రవీణ్‌కు ధన్యవాదాలు. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌'' అని నాగచైతన్య మాట్లాడారు.

మా ధైర్యం నాన్నే: అఖిల్‌

''నాన్నను ఎలా చూడాలనుకుంటున్నానో ఈ సినిమాలో అలా చూశా. నేనూ చైతన్య కాలర్‌ ఎగరేస్తున్నాం. ఈ విషయంలో దర్శకుడు ప్రణీణ్‌కు థ్యాంక్స్‌. 'ఈయనకు సినిమాపై ప్యాషన్‌ తగ్గదా? ఆకలి తగ్గదా?' అని నాన్న గురించి నేనూ చైతన్య మాట్లాడుకున్నాం. 30 ఏళ్లుగా ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్నారాయన. మా ధైర్యం, స్ఫూర్తి.. ఇంట్లోనే ఉందని మాకు ఇప్పుడు అర్థమైంది. మేం ఎంతగా పరిగెత్తాలో మీరే చూపిస్తున్నందుకు థ్యాంక్స్‌ నాన్న. 'ది ఘోస్ట్‌' సినిమా ప్రారంభం నుంచీ ఫైర్‌తోనే ముందుకెళ్తోంది. చిత్ర బృందం కష్టమంతా ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది'' అని అఖిల్‌ పేర్కొన్నారు.

దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ.. ''ఈ సినిమా విషయంలో ముందుగా మా నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్మోహన్‌, ఈ వేడుకకు విచ్చేసిన అఖిల్‌, నాగచైతన్యలకు ధన్యవాదాలు. నాగార్జున సర్‌ను డైరెక్ట్‌ చేయటం మరిచిపోలేని అనుభూతి. మీ (అభిమానులు) అంచనాలకు తగ్గట్టు 'ది ఘోస్ట్‌'ని తెరకెక్కించాననే నమ్మకం ఉంది. ఓ అభిమానిగా ఆయన్ను ఎలాంటి పాత్రల్లో చూస్తూ పెరిగానో ఈ సినిమాలో అలాగే చూపించా'' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: