
టాలీవుడ్ కింగ్ నాగార్జున శతక చిత్రాలకు చెరువులో ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్స్ లో బాలకృష్ణ, చిరంజీవి ఈ మైల్ స్టోన్ ని ఆల్రెడీ అధిగమించగా.. ఇప్పుడు నాగార్జున టర్న్ వచ్చింది. ఆయన వందో సినిమా గురించి గత కొంతకాలంగా చాలా చర్చలే జరుగుతున్నాయి. ప్రస్తుతం ` కుబేర `, ` కూలి ` చిత్రాలతో బిజీగా ఉన్న నాగార్జున.. కెరీర్ లోనే బెంచ్ మార్క్ ఫిల్మ్ అయిన 100వ సినిమాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మార్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. నాగార్జున 100వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ తమిళ దర్శకుడు రా కార్తీక్ కు దక్కినట్లు తెలుస్తోంది. 2022లో విడుదలైన తమిళ డ్రామా ` నితం ఓరువానం (తెలుగులో ఆకాశం) `తో కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డెబ్యూతో తమిళనాట ప్రశంసలు అందుకున్న కార్తీక్ కు తెలుగులో మాత్రం గుర్తింపు దక్కలేదు. అయితే నాగార్జున 100వ చిత్రంలో కార్తీక్ నేరుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాగ్, కార్తీక్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతుందట. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు కూడా తెరపైకి వచ్చింది. అదే ` కింగ్ 100 `. ఏఎన్నార్ గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జునను కొన్నేళ్ల పాటు యువ సామ్రాట్ ట్యాగ్ తో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు పిలుచుకునేవారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడు తరం హీరోలుగా నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చాక.. యువ సామ్రాట్ ట్యాగ్ ను చైతూకు కట్టబెట్టారు.
అదే సమయంలో నాగార్జునకు ` కింగ్ ` అంటూ కొత్త బిరుదును ఇచ్చారు. అయితే ఇప్పుడు నాగార్జున వందో సినిమాకు ఆయన బరుదునే టైటిల్ గా ఖరారు చేయబోతున్నారట. ` కింగ్ 100 ` టైటిల్ తో ఆయన మైల్ స్టోన్ మూవీ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.