స్టార్ హీరోలు కలిసి నటించే సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక్క స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడే అభిమానులకు అది పండగలా మారితే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది టాప్ హీరోలు కలిసి నటిస్తే ఆ ఉత్సాహం ఆకాశాన్ని తాకుతుంది.గతంలో ఈ మల్టీస్టారర్ క్రేజ్‌ను పూర్తిగా ప్రతిబింబించిన సినిమాలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, అలాగే ఆర్ఆర్ఆర్ నిలిచాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా భారీ విజయాన్ని సాధించింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.


ఇప్పుడు అలాంటి మల్టీస్టారర్ మ్యాజిక్‌ను మరోసారి తెరపైకి తీసుకురావడానికి కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సిద్ధమవుతున్నాడనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఖైదీ, విక్రమ్, మాస్టర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సంపాదించిన లోకేష్, తన సినిమాటిక్ యూనివర్స్‌తో ఇండియన్ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా మేళవించడం అతని ప్రత్యేకత. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ఒక సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా, పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.



టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, లోకేష్ ఇప్పటికే ఓ భారీ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వినిపించాడని, కథ నచ్చడంతో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కథకు ఒక్క హీరో సరిపోడని, కనీసం ఇద్దరు స్టార్ హీరోలు ఉంటేనే కథకు పూర్తి న్యాయం జరుగుతుందని లోకేష్ భావిస్తున్నాడట. అందుకే మరో కీలక పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అయితే అద్భుతంగా సరిపోతాడని ఆయన అనుకున్నాడని టాక్. ఇక ఈ ప్రతిపాదనపై అల్లు అర్జున్ కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. “ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉంటేనే ఇది మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుంది” అంటూ బన్నీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో లోకేష్ కనగరాజ్ ఇప్పుడు పూర్తిగా ఎన్టీఆర్‌ను సంప్రదించే ప్రయత్నాల్లో ఉన్నాడట. త్వరలోనే తారక్‌కు ఈ భారీ కథను వినిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్‌పైకి వెళ్లి, అల్లు అర్జున్జూనియర్ ఎన్టీఆర్ కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తే, అది టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత క్రేజీ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల నిజమవుతున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఈ వార్త నిజమవుతుందా? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అన్నది చూడాల్సి ఉంది. కానీ అప్పటివరకు మాత్రం ఈ మల్టీస్టారర్ టాక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం

మరింత సమాచారం తెలుసుకోండి: